● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే..
● ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): బీజేపీ చేపట్టింది ‘రణభేరి‘ కాదని.. అది ‘రాద్ధాంత భేరి‘ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి విమర్శించారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడా రు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయక పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ ఛాన్సలర్లను కూడా నియమించని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే యూనివర్సిటీలకు వీసీ నియామకాలు జరిగి విద్యా వ్యవస్థ గాడిన పడుతోందన్నారు.
కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన, ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని పిలుపుని చ్చారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కార్పొరేటర్ అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు.


