● ‘ఉపాధి’ ఉద్యోగులకు మూడు
నెలలుగా విడుదల కాని వేతనాలు
● ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న
కుటుంబాలు
నందిపేట్(ఆర్మూర్): గ్రామాల్లోని పేదలకు ఉపాధి పథకం (‘వీబీ–జీ రామ్‌జీ’ –వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్) కింద పని కల్పించడంలో సిబ్బందే కీలక పాత్ర పోషిస్తారు. జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా కొనసాగేందుకు వివిద స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాంటి సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 516 మంది..
జిల్లాలోని 33 రెవెన్యూ మండలాల్లో వీబీ–జీ రామ్ జీ పథకంలో 516 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక ప్రాత పోషిస్తున్నారు. వీరు కూలీలకు పనులను కెటాయించడం, ఆన్‌లైన్‌లో వివరాలు నమెదు చేయడం, వేతనాలు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వరిస్తారు. ప్రతి నిత్యం ఈ పథకం సజావుగా సాగేందుకు నిరంతరం పనిచేస్తున్న వీరికి వేతన బకాయిలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు (ఏప్రిల్, మే, జూన్) పెండింగ్‌లో ఉన్నాయి. జులై చివరి వారానికి వచ్చినా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేసి, సకాలంలో అందించాలని ‘ఉపాధి’ సిబ్బంది కోరుతున్నారు.


