సుభాష్‌నగర్ : కుటుంబ నియంత్రణకు శాశ్వత, తాత్కాలిక పద్ధతులను అవలంబించాలని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ భుజంగరావు పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాతో కుటుంబానికి పోషణ భారమవుతుందన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ పిల్లలకు మధ్య సరైన అంతరంతోనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జీజీహెచ్ గైనకాలజిస్ట్ హెచ్‌వోడీ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణ రేఖ, డీఐవో డాక్టర్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.
రెండు క్లినిక్‌లు సీజ్
సుభాష్‌నగర్ : నగరంలో అనుమతులు లేకుండా కొనసాగుతూ కేసులు నమోదైన రెండు క్లినిక్‌లను డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గురువారం నాలుగు క్లినిక్‌లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుప్రియ, రామకృష్ణ ఆధ్వర్యంలో వీక్లీబజార్‌లోని చక్రవర్తి క్లినిక్, మాలపల్లిలోని హుదా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లను సీజ్ చేశారు. అధికారులు వేణుగోపాల్, నాలుగో టౌన్ ఎస్సై కరీం, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న బీఈడీ, బీపీఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపీఈడీ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పరీక్షలకు 64మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 1,484 మంది విద్యార్థులకు గానూ 1,420 హాజరు కాగా 64 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
డిగ్రీ పరీక్షలు..
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న డిగ్రీ వన్‌టైం ఛాన్స్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులకు గానూ 132 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 105 మంది విద్యార్థులకు గానూ 96 మంది విద్యార్థులు హాజరు కాగా 9మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.


