● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
సుభాష్‌నగర్: వేశ్య వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగించవద్దని, తమ పిల్ల లు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. గురువారం నగరంలోని ఖలీల్‌వాడిలో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్షన్ టార్గెట్ ఇంటర్వేన్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్య వృత్తి ఎంచుకుని తమ కుటుంబాన్ని పోషించుకున్నారని తెలిపారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించవద్దని సూచించారు. ఈ తరంతో వృత్తికి స్వస్తి పలకాలని, భవిష్యత్‌తరాలకు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. తమ పిల్లలు కూడా ఈ వృత్తిని ఎంచుకొని వారి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. పోలీస్‌శాఖ మహిళ సెక్స్ వర్కర్ల హక్కులు, వారి జాగ్రత్తల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సెక్స్ వర్కర్లకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని, హక్కుల కోసం పోలీస్‌శాఖ, షీ టీమ్, భరోసా సెంటర్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం విశేష సేవలు అందించిన సిబ్బంది, ఎడ్యుకేటర్లు, మహిళా సెక్స్ వర్కర్లను జిల్లా సంక్షేమాధికారి పద్మ అనిల్‌తో కలిసి సీపీ సన్మానించారు. కార్యక్రమంలో స్నేహ టీఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సిద్ధయ్య, జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకులు పురుషోత్తం, మానసిక వైద్యనిపుణులు డాక్టర్ ఏ వికాస్, డీపీఎం సుధాకర్, సీపీవో మొయిజ్ అహ్మద్, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి భానుప్రియ, స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


