డాక్టర్‌ కాసర్లకు ధర్మనిధి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కాసర్లకు ధర్మనిధి పురస్కారం

Mar 6 2026 8:28 AM | Updated on Mar 6 2026 8:28 AM

డాక్టర్‌ కాసర్లకు ధర్మనిధి పురస్కారం టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం

నిజామాబాద్‌ రూరల్‌: తెలంగాణ సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌ వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘ధర్మ నిధి పురస్కారం’ 2026వ సంవత్సరానికి ఇందూరు కవి డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావుకి అందజేయనున్నట్లు పరిషత్‌ ప్రధాన కార్యదర్శి జే చెన్నయ్య తెలిపారు. సాహిత్య రంగంలో విస్తృతమైన సేవలు నిరంతరం అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని ప్రతిఏటా పరిషత్‌ వారు అందజేస్తున్నారు. దీంట్లో భాగంగా గత 30 ఏళ్లుగా ఇందూరు జిల్లా సాహిత్య రంగంలో నిత్య కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, బాల సాహిత్య వేత్తగా రాణిస్తున్న కాసర్లకు ఈ ఏడాది పురస్కారం వరించింది. ఈనెల 17న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ లో అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఇతర సాహిత్య వేత్తల చేతుల మీదుగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాహిత్య ధర్మనిధి పురస్కారాన్ని అందుకోనున్న కవి కాసర్లను ఇందూరు జిల్లా కవులు వీపీ చందనరావు, పంచరెడ్డి లక్ష్మణ, తల్లా వజ్జల మహేశ్‌ బాబు, డాక్టర్‌ గణపతి అశోక శర్మ, డాక్టర్‌ తంగుడిగె ఫణీంద్ర, వారె దస్తగిరి, ప్రవీణ్‌ కుమార్‌ శర్మ, నాగుల రాజేందర్‌, అష్ట గంగాధర్‌ తదితరులు అభినందించారు.

సుభాష్‌నగర్‌: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తోపాటు నూతనంగా ఎన్నికై న గిరిజన ఆదివాసీ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌ను నిజామాబాద్‌ ఆదివాసీ చైర్మన్‌ కెతావత్‌ యాదగిరి నాయక్‌ గురువారం శాలువాతో సన్మానించారు. అంతకుముందు ఆదివాసీ గిరిజన విభాగం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోడు భూములపై హక్కులు, చేవెళ్ల డిక్లరేషన్‌పై సుదీర్ఘంగా చర్చించారు. గిరిజన, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించినట్లు కెతావత్‌ యాదగిరి నాయక్‌ తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ వెంకట్రాం నాయక్‌, బానోత్‌ రవీందర్‌, తదితరులు జిల్లా నుంచి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement