● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్
ముప్ప గంగారెడ్డి
మోపాల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులతో నిర్మించనున్న మండలంలోని కాస్‌బాగ్ తండా గ్రామపంచాయతీ భవనానికి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్లే గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని, ఒక్కో ఇందిరమ్మ లబ్ధిదారుడికి రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క ఇల్లు, రేషన్‌కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 25లక్షలకుపైనే రేషన్‌కార్డులు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ సదాసింగ్, ఉపసర్పంచ్ కమలాజీ, ఎంపీడీవో రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యెల్లోళ్ల సాయిరెడ్డి, నాయకులు సద్మల రాములు, పంచాయతీరాజ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.


