విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
కమ్మర్‌పల్లి: శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(వైఎస్‌పీ, యువ విజ్ఞాన్ కార్యక్రమం) ‘యువికా’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్యాచ్ దెమ్ యంగ్ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
అర్హులు–దరఖాస్తులు..
● ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఇస్రో మేటి ప్రయోగాలు చేస్తూ, దేశంలోని బాల మేధావులను ప్రోత్సహించే క్రమంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(యువికా) కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్(దరఖాస్తు) ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభం కాగా, మార్చి 31న ముగుస్తుంది.
● 2025–26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 8వ తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, ఆన్‌లైన్ క్విజ్ ప్రతిభకు, సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ చేసిన వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి 15 శాతం వెయిటేజీ మార్కులు కేటాయించి అనుమతిస్తారు. –ఆసక్తిగల విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ఠీఠీఠీ. జీటటౌ. జౌఠి. జీుఽ లో లాగిన్ అయి, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి.
● ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంట అనుమతిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూర్, షిల్లాంగ్, తిరువనంతపురంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
● మే 11న యువ విజ్ఞాన కార్యక్రమం..
ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో రెండు సార్లు జాబితాను ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 10న ఇస్రో కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 11 నుంచి 22 వరకు యువ విజ్ఞాన కార్యక్రమం నిర్వహిస్తారు.
యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు యువికా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ హెచ్‌ఎంలు, సైన్స్ టీచర్లు చొరవ తీసుకొని 9వ తరగతి విద్యార్థులకు ఈ విషయాలను తెలియజేసి, దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో ఉన్న శాసీ్త్రయ జిజ్ఞాసను మేల్కొల్పడం, అంతరిక్ష రహస్యాల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉంది.
–కె. గంగాకిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్
ఇస్రో చేపట్టిన యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా)కు ప్రచారం కరువైంది. జిల్లాలో ఐదేళ్లలో కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 26415 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే చేపడుతున్నారు. యువికా కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కూడా చాలా పాఠశాలలకు తెలియడం లేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తెలియజేసే విధంగా ఇస్రో చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
బాల శాస్త్రవేత్తల తయారీకి ‘యువికా’
ప్రత్యేక కార్యక్రమం
‘క్యాచ్ దెమ్ యంగ్’ పేరిట
యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్
దరఖాస్తుల స్వీకరణకు
మార్చి 31వరకు గడువు


