నలుగురికి తీవ్ర గాయాలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాధవనగర్ బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారు ఝామున కారు బోల్తా పడిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఇటుకబట్టి యజమాని చింతల శ్రీనివాస్, అదే గ్రామానికి చెందిన సాయిలు, ఐదుగురు బట్టీ కార్మికులతో కలిసి కారులో బుధవారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లారు. తిరిగి గురువారం తెల్లవారుఝామున నాందేడ్ నుంచి దోమకొండకు బయలుదేరారు. ఉదయం సుమారు 6.30 గంటలకు నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై సత్యనారాయణ క్రాకర్స్ షాపు దాటిన తర్వాత కారు అతివేగం వల్ల అదుపుతప్పి కల్వర్టు వద్ద రోడ్డు కిందకు దిగిపోయి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శోభ వాగ్మరే (42) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఆమె భర్త సత్వ తుకారాం వాగ్మరే (నాందేడ్ జిల్లా ముథ్‌ఖేడ్) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ఉన్న చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్‌రావు, నగరం సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సీతారాం, మృతుడి కుమారుడు బాలాజీ సత్వ వాగ్మరే (2 వతరగతి విద్యార్థి) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నారి బాలాజీ సత్వ అనాథగా మారాడు. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన సీపీ
పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితి సమీక్షించారు. సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. సీపీ వెంట డిచ్‌పల్లి ఎస్సై ఎండీ అరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఉన్నారు.


