గొంతులో రొట్టె అడ్డు తగిలి ఒకరి మృతి!
నస్రుల్లాబాద్: గోధుమ రొట్టె గొంతులో అడ్డు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాలు ఇలా.. దుర్కి గ్రామానికి చెందిన గరుగళ్ల చిన్న మొగులయ్య (45) బుధవారం రాత్రి ఓ పురాతన ఇంటి వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి నోటిలో గోధుమ రొట్టెలు ఉన్నాయి. గోధుమ రొట్టెలను ప్లాస్టిక్ కవర్‌లో తీసుకుని వచ్చి తింటుండగా గొంతులో అడ్డు తగిలి ఊపిరి ఆడక మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాడిలో ఒకరి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పోల్కంపేట అంజయ్య(42)కు 15ఏళ్ల క్రితం నింగసానిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో వివాహామయింది. కాగా గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో గత నెల 17న ఇరువురి మధ్య గొడవ జరగడంతో జ్యోతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అంజయ్య జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంటి పక్కన ఉన్న రేకులషెడ్డులోకి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
కామారెడ్డి క్రైం: మద్నూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న శరత్ కుమార్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో గాయపడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. శరత్ కుమార్ గౌడ్ ఉదయం బస్టాండ్‌లో బస్సు దిగే క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అదే బస్సు టైర్ అతడి కుడి కాలు పైనుంచి వెళ్లింది. కాలు మడమ నుంచి కింద భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.


