● బహుబాగు.. పాప్‌కార్న్ మక్క సాగు
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయం చేస్తున్న డొంకేశ్వర్ మండల రైతులు కొత్త రకాల పంటలను పండిస్తున్నారు. మండలంలోని తొండాకూర్ గ్రామాని కి చెందిన అల్లారి గంగాధర్ (సక్కర్ రెడ్డి) ప్రస్తుతం ఊరి సర్పంచ్‌గా పని చేస్తుండగా, మొక్కజొన్నలో పాప్‌కార్న్ రకాన్ని సాగు చేస్తున్నాడు. కంకితో క్వింటాలుకు రూ.2,200 చొప్పున వ్యాపారితో ముందస్తు ఒప్పందం చేసుకుని రెండెకరాల్లో పాప్‌కార్న్ మక్కను వేశాడు. యాసంగిలో 90 రోజుల పాటు సాగయ్యే ఈ పంట ఎకరానికి 30–40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సక్కర్ రెడ్డి పేర్కొంటున్నారు. త్వరలోనే పంటకోత చేయనున్నట్లు వెల్లడించారు.
● డ్రమ్‌సీడర్‌పై అవగాహన
రుద్రూర్: కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలో గురువారం డా. రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోధన్ క్లస్టర్ పరిధిలో డ్రమ్ సీడర్ ఫీల్డ్ ఎక్స్‌పోజర్ రైతు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కేవీకే శాస్త్రవేత్త ఇందుదార్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ వీరస్వామి, ఏరియా మేనేజర్ అరుణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు డ్రమ్ సీడర్ వినియోగం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతులు పరికరాన్ని పరిశీలించి పలు సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
● సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరం
బోధన్: ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పండించిన సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆలిండియా భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయరెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్‌లో ఆదర్శ రైతు కరుటూరు పాపరావు సొంత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రసాయన రహితంగా పండించిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు వినియోగదారుల అందుబాటులో ఉంచారు. సాయరెడ్డి గురువారం పాపారావు ఇంట్లో ఉన్న సేంద్రియ ఆహార ఉత్పత్తులను పరిశీలించి, ఆయనను అభినందించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాజీ అధికారి దశరథ్ రెడ్డి పాల్గొన్నారు.


