● డీఎంహెచ్‌వో రాజశ్రీ
● ‘టెలీ మానస్’ కరపత్రాల ఆవిష్కరణ
సుభాష్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులపాటు నిర్వహించనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గురువారం ఆమె డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యవారం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 38 పీహెచ్‌సీల్లో రోగులకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కిషోర బాలికలకు హెచ్‌పీవీ టీకాలను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జీజీహెచ్‌లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మాతా శిశు మరణాలతోపాటు నెలలోపు శిశువుల మరణాల సంఖ్య తగ్గించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య పరీక్షలు, శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలో పరీక్షలంటే భయపడుతూ ఇతర సమస్యలతో బాధపడే విద్యార్థులు, యువకులను దృష్టిలో ఉంచుకుని మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ కోసం నిర్వహించే టెలి మానస్ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులకు ఎలాంటి మానసిక సమస్యలున్నా.. 14416 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, ఏవో సుమంత్ కుమార్, ఉప వైద్యాధికారులు రవీందర్, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


