డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి ప్రారంభంలోనే జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 3.36 మీటర్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలో 2.36 మీటర్లు, ఫిబ్రవరిలో 1 మీటరు మేర తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది. వరినాట్లు పూర్తి కావడంతో వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో మోటార్లకు నీరందక ఎత్తిపోతున్నాయి. పంట పొలాలకు నీరు అందించడానికి రైతులకు ఇబ్బందులు ఇప్పుడే మొదలయ్యాయి. కొన్ని చోట్ల వ్యవసాయ, గృహవసర బోర్లు సన్న ధార పోస్తున్నాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మూడు నెలలు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరిలో 9.56 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి ముగిసే నాటికి 11 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలతో (11.94 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అయినప్పటికీ భూరగ్భ జలాలు వేగంగా కిందికి వెళ్తున్నాయి. ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి మాసానికి సంబంధించిన నీటి లెక్కలను తీశారు. ఇందులో 45 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 30 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా 7 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యకర నీటి మట్టాలు 54.87శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. భీమ్‌గల్, సిరికొండ, డిచ్‌పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
వేసవిలో ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలి. రానున్న రోజుల్లో నీటి ఎద్దటి రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయకూడదు. వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. – శ్రీనివాస్‌బాబు,
జిల్లా భూగర్భ జల శాఖ అధికారి


