ఏకలవ్య సిబ్బందిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్య సిబ్బందిపై వేటు

Mar 5 2026 7:18 AM | Updated on Mar 5 2026 7:18 AM

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై

కలెక్టర్‌ సీరియస్‌

ప్రిన్సిపాల్‌తోపాటు నలుగురి సస్పెన్షన్‌

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండాలోని ఏకలవ్య ఆదర్శ గురుకులం విద్యార్థి ఆత్మహత్యఘటనను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆర్‌సీవో గంగారాం నాయక్‌ నేతృత్వంలో ఇతర జిల్లాల ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపాల్‌లు శ్రీనివాస్‌స్వామి, డాక్టర్‌ సైదా జైనబ్‌, ఫణికుమార్‌, డాక్టర్‌ జ్యోతి ప్రాథమిక విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ రమేశ్‌కుమార్‌, హౌజ్‌ మాస్టర్‌ కుల్దీప్‌యాదవ్‌, హాస్టల్‌ వార్డెన్‌ విశ్వంబర్‌, మెస్‌ ఇన్‌చార్జి ఆకాశ్‌యాదవ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కలెక్టర్‌ త్రిపాఠి బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి తొమ్మిదో తరగతి విద్యార్థి రామ్‌చరణ్‌ ఆత్మహత్య ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్‌ సొంతమవుతుందన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని సూచించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కలెక్టర్‌ వెంట ఆర్‌సీవో గంగారాం నాయక్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement