● పీడీఎస్‌యూ డిమాండ్
డిచ్‌పల్లి: ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం విద్యార్థి మృతి పై వివరాలు సేకరించడానికి పీడీఎస్‌యూ నాయకులు ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కర్క గణేశ్ మాట్లాడుతూ విద్యార్థి రామ్‌చరణ్ మంగళవారం ఉరి వేసుకుని మృతి చెందిన ఘటనలపై అనుమానాలున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు మున్నా, జీవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి:బీజేవైఎం
ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు పాఠశాల ప్రిన్సిపాల్, కొంతమంది ఉపాధ్యాయుల మానసిక ఒత్తిడి కారణమని తోటి విద్యార్థులు వెల్లడించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ పాల్గొన్నారు.
బాధ్యులను శిక్షించాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ఖలీల్‌వాడి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి అనుమానాలున్నాయని, బాధ్యులు శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ అన్నారు.ఈమేరకు బుధవారం విఘ్నేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
న్యాయం జరిగే వరకు పోరాడుతాం: ఏబీవీపీ
ఖలీల్‌వాడి: ఇందల్వాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి ఆన్నారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ సమీర్, విద్యార్థి నాయకులు అశోక్, శివ, లెనిన్, కార్తీక్, నితిన్ పాల్గొన్నారు.


