భర్తీకి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

భర్తీకి కసరత్తు

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

సంస్థాగత పదవుల

ఏర్పాటు కానున్న డీసీసీ కార్యవర్గం

ప్రాధాన్య పోస్టులకు పెరుగుతున్న డిమాండ్‌

ఆశలు పెంచుకున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ కాంగ్రెస్‌లో సంస్థాగత పదవుల కేటాయింపుల్లో భాగంగా జిల్లాలో డీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పరిషత్‌ ఎన్నికలు మినహా స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్‌ పార్టీ వచ్చే రెండు వారాల్లో సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను షురూ చేయనుంది. అయితే పార్టీ పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినవారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధినాయకత్వం చెబుతోంది. దీంతో ఈ పదవుల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, ఆయా నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తాజాగా వికారాబాద్‌ జిల్లాలో పదిరోజుల పాటు నిర్వహించిన జిల్లా అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గమే ప్రధానమని చెప్పడంతో మరింత డిమాండ్‌ పెరిగింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను వన్‌ టు వన్‌ అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీ ప్రక్రియ నిర్వహించింది. ఈ క్రమంలో పార్టీ పదవులకు తిరుగులేని ప్రాధాన్యత ఉన్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ పదవులకు డిమాండ్‌ పెరుగుతోంది. పైగా గత ఏడాదిలో యూత్‌ కాంగ్రెస్‌ పదవుల విషయంలో పోటాపోటీ నెలకొన్న విషయాన్ని కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే నిత్యం ప్రజల్లోకి వెళ్లాలని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకత్వం చెబుతోంది. అందువల్ల భవిష్యత్తులో ఉన్నత పదవులకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు మంచి ప్రాధాన్యత దక్కుతుందని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే పార్టీ పదవుల నియామకాల్లో భాగంగా డీసీసీ కార్యవర్గం విస్తరణ చేసేందుకు రంగం సిద్ధం అవుతుండడంతో శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement