ఆడా.. ఈడా ఓటేశారు | - | Sakshi
Sakshi News home page

ఆడా.. ఈడా ఓటేశారు

Mar 4 2026 7:24 AM | Updated on Mar 4 2026 7:24 AM

విచారణ వాయిదా..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు కోసం రంగ మాధవితో పాటు ఇప్ప ఉమారాణి ప్రయత్నించారు. అయితే పార్టీ మాధవికి టికెట్టు కేటాయించడంతో ఉమారాణి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఈ పోరులో మాధవిపై మూడు ఓట్ల ఆధిక్యతతో ఉమారాణి గెలిచారు. ఓటమిపై సమీక్ష నిర్వహించగా ఆసక్తికర విషయం తెలిసింది. 40 వ వార్డులో ఓటేసినవారిలో చాలామంది 38 వ వార్డులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని, అలాగే రాజంపేట మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన వారు కామారెడ్డి పట్టణంలోని 38 వ వార్డులో ఓటు వేశారని గుర్తించారు. తన ఓటమికి దొంగ ఓట్లే కారణమంటూ మాధవి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కొందరు ఓటర్లు రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డిలోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జీ కోర్టులో మంగళవారం పిటిషన్‌ వేశారు. రెండు వార్డులలో ఓటేసిన వారి వివరాలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేయడంపై పిటిషన్‌లో వివరించినట్టు సమాచారం.

రెండు వార్డులలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఓటర్లు

కోర్టు మెట్లెక్కిన కామారెడ్డి 38వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి

ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్‌

కామారెడ్డి 38వ వార్డునుంచి పోటీ చేసి మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలైన రంగ మాధవి దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలు, నిబంధనల ఉల్లంఘనను పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement