● సమస్య పరిష్కారానికి సర్పంచ్
వినూత్న ఆలోచన
● గోడలపై దేవుళ్ల వాల్‌పెయింటింగ్
మోర్తాడ్(బాల్కొండ): ఇళ్లలోని చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపక్కన పారవేస్తుండడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించకపోవడంతో మెండోరా మండల కేంద్రం సర్పంచ్ బుట్టడి ప్రమోద్‌కుమార్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లను పరిశుభ్రం చేయించి అక్కడి గోడలపై దేవుళ్ల చిత్రాలను పెయింట్ వేయించారు. దీంతో అక్కడ చెత్త వేయలేక తమ ఇళ్లలోనే ఉంచి చెత్త సేకరణ వాహనానికి అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ వినూత్నంగా ఆలోచించి ‘చెత్త పనులకు’ చెక్ పెట్టారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో గోడలపై దేవుళ్ల చిత్రాలతో పెయింటింగ్‌తోపాటు ‘చెత్త వేయరాదు’ అంటూ అవగాహన కల్పిస్తూ రాయించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని..
చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, చెత్త సే కరణ వాహనానికి అందించా లి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వాహనం రావడం లేదని కొందరు చెత్తను వీధుల్లో పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెత్తను సేకరించడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఇలా ఆలోచన చేశాం. ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. – బుట్టడి ప్రమోద్‌కుమార్, సర్పంచ్, మెండోరా


