4 నుంచి దూరవిద్య రెండో సెమిస్టర్ పరీక్షలు
ఖలీల్‌వాడి: ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు అంబేడ్కర్ దూరవిద్య ఏంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ రంజిత ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జీజీ కాలేజీలో కొనసాగుతాయని, పూర్తి వివరాలకు అంబేడ్కర్ యూనివర్సిటీకి వెబ్‌సైట్ www.braouonline.in ను సంప్రదించాలని సూచించారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్‌అర్బన్: హోలీ వేళ ప్రజలు నిబంధనలు పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో హోలీ వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టంలేని వారికి రంగులు చల్లడం, వాహనాలపై గుంపులుగా తిరగడం చేయొద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సేవా కార్యక్రమాల్లో ముందుండాలి
నిజామాబాద్ రూరల్: సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. నగరంలోని పెన్షనర్స్ భవన్‌లో ఆదివారం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ చేసే కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో ప్రకటించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకి సహకరిస్తూ సేవల్లో పాల్గొంటున్న వారికి సేవా స్ఫూర్తి–2026 పేరిట అవార్డులను ఆయన అందజేశారు. అందించారు. అలాగే అన్నదానం, అనాథ శవాల అంతిమ సంస్కారాల గురించి 2 పాటల సీడీలను ఆవిష్కరణ చేశారు. బస్వారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ తరుపున సంస్థకు సహకారం ఎపుడు ఉంటుందన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు, ప్రవీణ్ యాదవ్, 38వ డివిజన్ కార్పొరేటర్ సతీష్ కుమార్, వినోద్, సంస్థ ప్రతినిధులు సుజాతరెడ్డి, పుష్పవతి, నాగమణి, హనుమండ్లు పాల్గొన్నారు.


