ప్రమాదాల ప్రయాణాలు
ప్రమాదాలు జరగకుండా చూడాలి
వర్షాకాలం లోపే పనులు పూర్తవుతాయి
ఇందల్వాయి: ఇందల్వాయి– ధర్పల్లి రోడ్డు మార్గంలో వంతెన పనులతో పాటు, రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈమార్గంలో నిత్యం వేలాది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. లింగాపూర్ వాగుపై నూతనంగా నిర్మించిన వంతెన పూర్తయినా ఇరువైపులా సమాంతరంగా రోడ్డు వేయకపోవడంతో వాహనాలు నిటారుగా వంతెనపైకి ఎక్కాల్సి వస్తుంది. ఈక్రమంలో వాహనాలు పట్టు తప్పితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అన్సాన్‌పల్లి వద్ద అటవీ ప్రాంతంలో నిలిచిపోయిన రోడ్డు పనులు కూడా ప్రయాణికులను ప్రమాదాలబారిన పడేలా చేస్తున్నాయి. భారీ గుంతలతో ఈ ప్రాంతంలో ఇదివరకే ఇద్దరు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
పనుల్లో జాప్యం ఇందుకే..
లింగాపూర్ వంతెన నిర్మించిన కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. వంతెన పనులు పూర్తయినా ఇరువైపులా సమాంతరంగా రోడ్డు వేయడం మిగిలిపోయింది. అన్సాన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు నిలిచి మూడేళ్లు అవుతుంది. అటవీ శాఖకు సమకూర్చాల్సిన నిధుల లేమి కారణంగానే అనుమతులు నిలిపివేసింది.
లింగాపూర్ వంతెన పనులతో పాటు ఎల్లారెడ్డిపల్లె–అన్సాన్‌పల్లి గ్రామాల మధ్య రోడ్డును బాగు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. నాలుగు మండలాలకు చెందిన వేల సంఖ్యలో వాహనాలు నిత్యం ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. –సక్కి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపల్లె
అవసరమైన నిధుల కోసం నివేదికలు పంపించాం. నిధులు సమకూరగానే రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. వర్షాకాలం లోపే పనులు పూర్తవుతాయి. అప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడుతున్నాం.
–గంగాధర్, ఆర్‌అండ్‌బీ ఏఈ, ఇందల్వాయి
ఇందల్వాయి– ధర్పల్లి మార్గంలో
అసంపూర్తిగా రోడ్డు పనులు
అన్సాన్‌పల్లి అటవీప్రాంతంలో
భారీగుంతలు
గతంలో ఇద్దరి మృతి..
పలువురికి తీవ్రగాయాలు
పట్టించుకోని అధికారులు
ప్రమాదాల ప్రయాణాలు
ప్రమాదాల ప్రయాణాలు


