చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి కరువు
● సెగ్రిగేషన్‌యార్డులు అలంకార ప్రాయం..అసాంఘిక కార్యకలాపాలకు నిలయం
● పల్లెల్లో సేంద్రియం సుదూరం
● పట్టింపులేని పాలకులు
రెంజల్(బోధన్): పల్లెప్రగతిలో భాగంగా గత ప్రభుత్వం గ్రామాల వికాసం కోసం చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసింది. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. లక్షలు వెచ్చించి ప్రతి గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. సేంద్రియ ఎరువును తయారు చేసి జీపీలను ఆర్థికంగా బలోపేతంగా మార్చాలనే ఆలోచనకు తగినట్లుగా నిర్వహణ, ఏర్పాట్లు లేకపోవడంతో పల్లెల్లో సంపద తగలబడిపోతుంది.
ఆదాయానికి నిప్పు..
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి పంచాయతీలకు ఆదాయం పెంచే లక్ష్యంతో జిల్లాలోని ప్రతీ పంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో సెగ్రిగేషన్‌షెడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణాలను పూర్తి చేశారు. తడి పొడి చెత్త సేకరణకు ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్, గాజు బాటిళ్లు, పేపర్లు, అట్టలు, మెటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, చెప్పులు, పనికిరాని పాత బట్టలు, సంచులు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకవచ్చి సెగ్రిగేషన్ షెడ్డులోని వేర్వేరు గదుల్లో వేరుగా చేసి తద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీలు ఆదాయం పెంపొందించుకోవాలి. జిల్లాలో ఈ ప్రక్రియ అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో సేకరించిన చెత్తను రొడ్లు, చెరువులు, కుంటలు, వాగులు, ఖాళీ ప్రదేశాల్లో పారేసి వారానికి ఒక రోజు తగులబెట్టడంతో ప్రయాణికులు, గ్రామస్తులు పొగతో ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో 545 జీపీలు ఉండగా.. అన్ని జీపీల్లో ఇదే పరిస్థితి ఉంది.
సేంద్రియ ఎరువు తయారు చేయాలి
గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రీయ ఎరువు తయారు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు అందించాం. నూతన పంచాయతీ పాలక వర్గాలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో సైతం సర్పంచ్‌లకు సూచించడం జరుగుతుంది. తప్పనిసరిగా పంచాయతీలకు లాభాలను అందించే సేంద్రియ ఎరువుపై ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. – నాగరాజు, డీఎల్‌పీవో బోధన్
కుంటుపడుతున్న ప్రగతి పనులు..
గ్రామాలకు దూరంగా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. వ్యర్థం స్వచ్ఛ స్ఫూర్తిగా విరుద్ధంగా చెత్తగా చెత్త నిర్వహణ చేస్తుండగా కనీసం సెగ్రిగేషన్ షెడ్ల వైపు అధికారులు కన్నెత్తి చూడటంలేదు. పల్లె ప్రగతి పనులు గ్రామాల్లో కుంటుపడుతున్నాయి. ప్రస్తుత పాలకులైనా పట్టించుకోల్సిన అవసరం ఉంది.
చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి కరువు


