చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
డిచ్‌పల్లి: మండలంలోని దూస్‌గాం చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతైన నందాల జగన్నాథం (48) మృతదేహం ఆదివారం 12 గంటలకు లభ్యమైంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్‌కు చెందిన నందాల జగన్నాథం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం దూస్‌గాం గ్రామానికి చెందిన వ్యక్తి జగన్నాథం ఆటోను కిరాయికి మాట్లాడుకుని నవీపేట్ సంతలో మేకలు కొనుగోలు చేశాడు. ఆటోలో మేకలను తీసుకుని దూస్‌గాం గ్రామంలో దింపేసి ఆ వ్యక్తితో కలిసి జగన్నాథం తిరిగి నిజామాబాద్‌కు బయలుదేరాడు. గ్రామశివారులోని చెరువు కట్టపై ఉన్న హనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఆటోను నిలిపివేశాడు. స్నానం చేసి హనుమంతుడిని దర్శించుకుందామని చెప్పి చెరువులో స్నానానికి దిగాడు. చెరువులో మొరం కోసం తవ్విన పెద్ద పెద్ద గుంతల్లో పడి అతను మృతి చెందాడు. ఆటో వద్ద వేచి ఉన్న వ్యక్తి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు జాలర్ల సాయంతో శనివారం రాత్రి వరకు చెరువు నీటిలో గాలించినా మృతదేహం లభించలేదు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు జరపగా మధ్యాహ్నం మృతదేహం లభించింది. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


