క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇందల్వాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన చెవుల చిన్నయ్య(50) ఆదివారం ఉదయం జాతీయ రహదారి గుండా తన పొలానికి నడుచుకుంటు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో కరెంట్ షాక్‌తో పెయింటర్ ఆదివారం మృతి చెందాడు. కామారెడ్డి పట్టణానికి చెందిన అజీజ్ జంగంపల్లి గ్రామంలో ఓ ఇంటికి పెయింటిగ్ వేసేందుకు కూలి కుదుర్చుకుని వచ్చాడు. ఇంటి పైన పెయింటింగ్ వేస్తుండగా పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లింగంపేట: చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. లింగంపేట మండలం నల్లమడుగు సేవాలాల్ తండాకు చెందిన గుగులోత్ సంగ్యానాయక్ రామలక్ష్మణ్‌పల్లి శివారులో ఉన్న వ్యవసాయ పొలం వద్ద ఆవు, లేగదూడలను పశువుల కొట్టంలో రోజులాగే కట్టేశాడు. శనివారం రాత్రి కొట్టంలోకి ప్రవేశించిన చిరుత దూడపై దాడి చేసి చంపేసింది. మరో ఆవు తాడు తెంపుకొని ఇంటికి రావడంతో అనుమానం వచ్చిన సంగ్యానాయక్ పొలం వద్దకు వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా బీట్ ఆఫీసర్ లింగయ్య, చంద్రశేఖర్, శేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లేగదూడ చిరుతదాడిలో మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతి చెందిన దూడ విలువ రూ. 30వేలు ఉంటుందని అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


