ఆదివాసీ నాయక్‌పోడ్ కులస్తులు గ్రామస్థాయిలో ఏకం కావాలి
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) శివారులో ఆదివారం ఆదివాసీ నాయక్‌పోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్‌పోడ్ రాష్ట్ర ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు కూన దయానంద్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెసిలేని రాజన్న, పళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. నూతన రాష్ట్రస్థాయి కమిటీని త్వరలో ఎన్నుకోవాలన్నారు. ఖమ్మం వాస్తవ్యులు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పసుల బుచ్చయ్య సంఘాన్ని బలోపేతం చేయడం లేదని, ఈ విషయమై రాష్ట్ర గిరిజన కమిషనర్‌ను కలిసి రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిల్లో ఆదివాసీ నాయక్‌పోడ్ కులస్తులను ఏకం చేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలను అందరికీ అందేలా నూతనంగా ఏర్పడే రాష్ట్రస్థాయి కమిటీ కృషి చేయాలన్నారు. నూతన రాష్ట్ర కమిటీ ఏర్పడే వరకు 13 జిల్లాల నుంచి ఒక్కో సభ్యుడిని తీసుకుని తాత్కాలికంగా అడ్‌హక్ కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం రాష్ట్రస్థాయి నాయకులు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, కరీంనగర్, మహబూబాబాద్ తదితర జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


