పీఎంశ్రీ పాఠశాలలు బేష్
● సెంట్రల్ నోడల్ అబ్జర్వర్
దేవేంద్ర కుమార్ రాయ్
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు బాగుందని సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ అన్నారు. జిల్లాలో పీఎం శ్రీ నిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులు, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి డీఈవో అశోక్ పవర్ పాయింట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ కార్యక్రమాల అమలుపై పాఠశాలల్లో ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరుస్తున్నారని అభినందించారు. విద్యార్థులు కార్యక్రమాలపై ఆకర్షితులై ప్రగతిని కనబరుస్తున్నారని, ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తన పరిశీలనలో గమనించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, కిచెన్ గార్డెన్ల నిర్వహణ ఎంతో బాగుందని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. సెంట్రల్ అబ్జర్వర్ పాఠశాలల్లో కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అభినందించడం సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి జిల్లా విద్యాశాఖకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని అన్నారు. గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలను అభినందించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ విజయలక్ష్మి బాయి, రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఏడీ నాగజ్యోతి, హెచ్‌ఎంలు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.


