మంజీరలో మళ్లీ లొల్లి
బోధన్: తెలంగాణ – మహారాష్ట్ర మధ్య ప్రవహించే మంజీర నది సరిహద్దు వివాదం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. మహారాష్ట్ర అనుమతులతో ఇటీవల మంజీరలో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ఇసుక క్వారీలను విస్తృతంగా అప్పగిస్తోంది. అక్కడి అనుమతులు పొందుతున్న కాంట్రాక్టర్లు మన సరిహద్దులోకి చొచ్చు వచ్చి ఇసుకను తరలించడం మామూలు విషయంగా మారింది. తాజాగా సాలూర మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న తగ్గెల్లి గ్రామ శివారులోని మంజీర నుంచి ఇసుక తరలింపు వివాదాస్పదమైంది. అవతలి ఒడ్డున ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని బిలొలి తాలూకా పరిధి గంజ్‌గాం గ్రామ శివారులో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లు అనుమతి పొందారు. వాస్తవంగా అనుమతి పొందిన ప్రదేశంలో ఇసుక మేటలు అంతంమాత్రంగానే ఉన్నాయి. అయితే నెల రోజుల క్రితం నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్లు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి 10 ఎకరాల విస్తీర్ణం నుంచి రోజుకు వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లలో టన్నుల కొద్దీ రూ.కోట్లు విలువ చేసే ఇసుక ఆ ప్రాంతం వైపు తరలించారనే ఆరోపణలున్నాయి. తాము సమాచారం ఇస్తేగానీ మండల రెవెన్యూ అధికారులు స్పందించలేదని గ్రామస్తుల ఆరోపించారు. ఆ తరువాతే సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు అధికారులు సమాచారం అందించగా, ఆయన బిలోలి తాలూకా తహసీల్దార్‌తో మాట్లాడినట్లు తెలిసింది. గత నెల 23న ఇన్‌చార్జి తహసీల్దార్ అనూష, ఎంఆర్‌ఐ ఆనంద్, సర్వేయర్లు కలిసి తగ్గేల్లి శివారులోని మంజీరలో రాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. పలు చోట్ల ఎత్తైన కర్రకు ఎర్రగుడ్డలను కట్టి హద్దులుగా ఏర్పాటు చేశారు. ఎర్రజెండాలే ప్రస్తుతం హద్దు రాళ్లుగా దర్శనమిస్తున్నాయి. సర్వే చేపట్టిన సమయంలో సర్వేయర్లతో కాకుండా బిలోలి తాలూకా తహసీల్దార్ ఒక్కరే అక్కడికి వచ్చారు. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్దారించుకుందామని సాలూర మండల రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా.. తమ ప్రాంత సర్వేయర్లు మార్చి 1వ తేదీ వరకు సమ్మెలో ఉన్నారని, వారు వచ్చిన వెంటనే చేపడదామని ఆయన సమాధానమిచ్చారు. అప్పటి వరకు ఇసుక తవ్వకాలు ఆపేయాలని మండల రెవెన్యూ అధికారులు ఆయనకు సూచించారు.
వాహనాల రాకపోకల కోసం మంజీరలో ఏర్పాటు చేసి తాత్కాలిక దారి
పర్యవేక్షణ, నిఘా కరువు
హద్దులు గుర్తించాం
తగ్గెల్లి గ్రామ శివారులోని మంజీర నదిలో తెలంగాణ ప్రాంత హద్దును సర్వే చేసి గుర్తించాం. మన హద్దుల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు సర్వేలో తేలింది. సర్వే సమయంలో అక్కడికి వచ్చిన బిలోలి(మహారాష్ట్ర) తహసీల్దార్‌కు జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్దారించుకుందామని ప్రతిపాదించాం. వాళ్ల సర్వేయర్లు సమ్మెలో ఉన్నారని చెప్పారు. ఇక నుంచి మన హద్దుల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని సూచించగా ఆయన అంగీకరించారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. – అనూష, ఇన్‌చార్జి తహసీల్దార్
మన హద్దులో ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఫిర్యాదు చేసే వరకు రెవెన్యూ శాఖ అధికారులు మేల్కోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు, అధికారులు ఇసుక అక్రమరవాణాను అడ్డుకోగా ఇసుక మాఫియా ఎదురుదాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. హద్దులను నిర్దారించేందుకు అనేక సార్లు సర్వేలు చేపట్టినా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీరలో భారీగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
మహారాష్ట్ర అనుమతులతో ఇసుక దోపిడీ
తగ్గెల్లి శివార్లలోని రాష్ట్ర సరిహద్దులో భారీగా తవ్వకాలు
ఆలస్యంగా స్పందించిన రెవెన్యూశాఖ
తేలని సరిహద్దు వివాదం
మంజీరలో మళ్లీ లొల్లి


