గోదాములను సిద్ధం చేయండి
నిజామాబాద్ రూరల్: ధాన్యం నిలువ చేసేందుకు గోదాములను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయాశాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శాఖల వారిగా అభివృద్ధి పనుల ప్రగతిని తెలుసుకున్నారు. రైస్‌మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత, లేవీ రూపంలో వారు ఎఫ్‌సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు, ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది, ఎన్ని గోదాములు అందుబాటులో ఉన్నాయి తదితర వివరాలపై సివిల్ సప్లయీస్ అధికారుల ద్వారా ఆరా తీశారు. ప్రస్తుత సీజన్ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. లేవీ అందించడంలో విఫలమైన 57మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులు వేగంగా చేపట్టాలన్నారు. భవిత కేంద్రాల నిర్మాణ పనులను యు ద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించాలని, క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అధికారులు పాల్గొన్నారు.


