బోధన్ ఆర్టీసీ డిపోలో కలకలం
● డ్యూటీ కేటాయింపులో వివాదం
● డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
బోధన్: డ్యూటీ కేటాయింపు విషయంలో కంట్రోలర్, డ్రైవర్‌కు మధ్య వాదన చోటు చేసుకున్న ఘటన బోధన్ ఆర్టీసీ డిపోలో శనివారం చోటు చేసుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని డ్రైవర్ తాడు వెంట తీసుకుని డిపో గేటుపైకి ఎక్కాడు. ఈ ఘటన కలకలం రేపింది. ఉదయం డ్యూటీకి వచ్చిన సురేశ్ తనకు వేసిన డ్యూటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంట్రోలర్‌తో వాదనకు దిగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని డిపో గేటుపైకి ఎక్కగా, అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు అతడిని సముదాయించి కిందికి దింపారు. ఈ ఘటనపై డిపో మేనేజర్ విశ్వనాథంను ‘సాక్షి’ వివరణ కోరగా.. డ్రైవర్ సురేశ్‌కు బోధన్–జేబీఎస్ సర్వీసుకు డ్యూటీ కేటాయించగా, తనకు వరంగల్ రూట్‌లో డ్యూటీ ఇవ్వాలని కంట్రోలర్‌తో వాదించాడని, ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుందన్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్న సురేశ్‌కు డ్యూటీ ఇవ్వలేదని, ఆదివారం యథావిధిగా డ్యూటీ కేటాయిస్తామన్నారు. డిపో అధికారులు కండక్టర్లు, డ్రైవర్లకు విధుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ యూనియన్‌లు మనుగడలో లేకపోవడంతో అధికారుల తీరును ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతోందని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


