యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నిజామాబాద్ రూరల్: యూరియాను పాత పద్ధతిలోనే అందజేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గాంధీనగర్ వద్ద నిజామాబాద్–వర్ని రోడ్డుపై రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ముత్తకుంట పీఏసీఎస్ పరిధిలోని గాంధీనగర్ గోదాముకు గురువారం ఉదయం యూరియా వచ్చినట్లు తెలుసుకొని రైతులు చేరుకున్నారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో తమకు చిన్న ఫోన్‌లు ఉన్నాయని, బుకింగ్ విధానం తెలియదని, ప్రస్తుతం పంట పొట్టదశకు చేరుకుందని యూరియా ఇవ్వాలని కోరారు. ఆన్‌లైన్ విధానం ద్వారానే యూరియా పంపిణీ చేస్తున్నట్లు తేల్చిచెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు.


