
అటకెక్కిన ఆహార భద్రత
● రుచి చూసిన తర్వాత విద్యార్థులకు
వడ్డింపు ఉత్తిమాటే..?
● నామమాత్రంగా మారిన కమిటీలు
● బయటి ప్రాంతాల్లో వంట
● బోగస్ ఏజెన్సీల ఇష్టారాజ్యం
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటైన ఆహారభద్రత కమిటీలు నామమాత్రంగా మారాయి. గతేడాది నవంబర్ 27వ తేదీన కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు కమిటీకి ఇన్‌చార్జిగా ఉండగా, పాఠశాలలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందిని ఈ కమిటీల్లో ఉంటారు. మండలాలు, డివిజన్ల వారీగా జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఆహార భద్రత కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం కలుషిత ఆహారాన్ని నియంత్రిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందేలా చూడడం. ప్రతిసారి వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్‌ను కమిటీ తనిఖీ చేయాలి. భోజనం సిద్ధం కాగానే కమిటీ సభ్యులు రుచి చూసిన తరువాత పిల్లలకు అందిస్తారు. మండలాలు, డివిజన్ల వారీగా నోడల్ ఆఫీసర్లు కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. భోజనానికి సంబంధించిన ఫొటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేస్తే వివరాలను ప్రతిరోజూ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
జరుగుతోంది ఇదీ..
నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం వేరే ప్రాంతంలో వంట చేసి తీసుకువస్తున్నారు. దీంతో భోజనం తయారీ సమయంలో పర్యవేక్షణ కొరవడింది. అర్బన్ ప్రాంతంలోని 12 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రారంభంలో కమిటీలు హడావుడి చేసినప్పటికీ ప్రస్తుతం నామమాత్రంగా మారాయి. భోజనం వికటించిన తర్వాత అధికారులు పరుగులు తీస్తున్నారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్య తప్పుగా నమోదు చేయడం, భోజనం నాణ్యత విషయంలో ప్రశ్నించిన హెచ్‌ఎం, సౌత్ మండల విద్యాశాఖాధికారి సాయారెడ్డిని ఏజెన్సీ నిర్వాహకుడు బెదిరించడం గమనార్హం. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో పర్యవేక్షణ లేకుండాపోయింది.
ఏజెన్సీల నిర్వాహకులు కాదు.. డిక్టేటర్లు
పలువురు మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు దీనిని పెద్ద బిజినెస్‌గా మార్చారు. వారు చెప్పిందే వేదంలా మారింది. ఫిర్యాదులు, విచారణలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయి.
● ఓ వ్యక్తి తమ బంధువుల పేరిట నగరంలో మొత్తం 23 ఏజెన్సీలను నిర్వహిస్తున్నాడు. కొనేళ్లుగా వారి చేతుల్లోనే ఏజెన్సీలున్నాయి. గతంలో మధ్యాహ్న భోజనం నిర్వహణలో రూ.7 కోట్ల 62 లక్షల అవినీతి వెలుగుచూసింది. దీంతో నాటి ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షలో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తిసుకోవాలని ఆదేశించారు. అయితే ఓ మంత్రి అతడికి సహకరించడంతో సేఫ్ అయ్యాడని అంతా చర్చించుకుంటున్నారు.
● ఓ మాజీ కార్పొరేటర్ నగరంలో 345 మంది విద్యార్థులున్న ఓ హైస్కుల్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. అతడిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నాటి డీఈవో లింగయ్య రెండు సార్లు ఏజెన్సీని రద్దు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం అతడే కొనసాగుతుండడం గమనార్హం. ఆ పాఠశాలలో భోజనం సరిగా ఉండకపోవడంతో విద్యార్ధులు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. ప్రతి రోజూ 100 మంది విద్యార్ధులు భోజనం చేస్తే 345 మంది విద్యార్థుల బిల్లులు పొందుతున్నాడు.
● మాజీ డిప్యూటీ మేయర్ ఒకరు నాలుగు పాఠశాలల భోజన ఏజెన్సీలను నడుపుతున్నాడు. ఒకే చోట వంట చేయించి అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నాడు. భోజనం నాణ్యతపై ఓ హెచ్‌ఎం గతంలో ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడు.
● ఆర్మూర్‌లో ఇద్దరు అధికారి పార్టికి చెందిన నాయకులు, బోధన్‌లో 9 మంది మాజీ ప్రజాప్రతినిధులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు/ గురుకులాలు / వసతిగృహాలు
ఖలీల్‌వాడి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం వేరే ప్రాంతంలో వంట చేసి ఈ ఆటోలో తీసుకువచ్చారు. వంట చేసే సమయంలో అసలు పర్యవేక్షణ లేకుండాపోయింది. అసలు ఎక్కడ వంట చేస్తున్నారు? వంట గది ఎలా ఉంది? అనే విషయాలను పట్టించుకునే వారు లేకుండాపోయారు.

అటకెక్కిన ఆహార భద్రత