
మట్టి గణపతికే జై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సనాతన సంప్రదాయంలో ప్రతి పండుగకూ అనేక పరమార్థాలు ఉంటాయి. పంచభూతాలు, ప్రకృతి వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటూ జీవనం గడపాలనే అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రతి అంశం జీవులన్నింటి మనుగడతో ముడిపడి ఉంటుంది. ఆది దేవుడిగా పూజలందుకునే వినాయకుడిని మట్టితో విగ్రహాలను చేసి పూజించాలనే పురాణాలు చెబుతున్నాయి. పరబ్రహ్మ స్వరూపమైన మృత్తిక (మట్టి) ద్వారానే అన్నిరకాల పోషకాలు లభిస్తున్నాయి. మట్టిలోనే మొక్కలు మొలిచి చెట్లుగా ఎదిగి అన్ని జీవులకు అవసరమైన ఆహారం తయారవుతోంది. అలాగే సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. తొలిపూజలందుకునే గణపతి విగ్రహాలను మట్టితోనే తయారు చేయాలని లింగపురాణంలో ఉంది.
● నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే హైందవ ఉత్సవ సమితి సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి 16 అడుగుల బాలగణపతి మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చారు. దీనికి పర్యావరణహిత రంగులనే వాడారు. గతేడాది నుంచి పర్యావరణహితంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు.
● పోచమ్మగల్లీలో రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా అక్కడిక్కడే బెంగాల్ కళాకారులతో మట్టి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈ ఏడాది 55 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. భారీ మట్టి విగ్రహం కావడంతో ప్రతిష్ఠించిన చోటే వాటర్ ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. ఈ గణేశుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
● మారుతినగర్‌లోని ఆర్‌ఆర్ అపార్టమెంట్‌తోపాటు వర్ని చౌరస్తా, న్యాల్‌కల్ చౌరస్తాల్లో మట్టిగణపతులు కొలువుదీరుతున్నాయి.
● నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారంలో బాలాజీ గణేశ్ మండలి, మల్కాపూర్‌లో శివపుత్ర గణేష్‌మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులు ప్రతిష్ఠిస్తున్నారు.
● బాల్కొండ మండల కేంద్రంలో నవయుగ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు.
సంప్రదాయం పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలి
వినాయకచవితి నవరాత్రుల నేపథ్యంలో విషరసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వాడడం మానేయాలి. దీంతో ప్రకృతిలోని అన్ని జీవరాసులకు సమస్య లేకుండా ఉంటుంది. అదేవిధంగా నవరాత్రుల మండపాల వద్ద సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఆధ్యాత్మిక, భక్తి పాటలు పాడాలి. మద్యం సేవించి మండపాల వద్దకు రావొద్దు. పోటీతత్వంతో కాకుండా శాస్త్రోక్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలి. సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలి.
– ధాత్రిక రమేశ్, వీహెచ్‌పీ జిల్లా సహ కార్యదర్శి
ఉత్సవం.. పర్యావరణ పరిరక్షణ కలగలిస్తేనే ఆనందం
జిల్లాలో మట్టి ప్రతిమలను విగ్రహాలను
ఆదర్శంగా నిలుస్తున్న పలు సంఘాలు
నేడు కొలువుదీరనున్న గణనాథులు

మట్టి గణపతికే జై