
మహిళ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్ అర్బన్: మహిళ, శిశు సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సమకూర్చాల్సిన వసతులు, సిబ్బంది ఖాళీలు, సొంత భవనాల నిర్మాణాల స్థితిగతులు తదితర అంశాలపై చర్చించి, ఐసీడీఎస్ అధికారులకు సూచనలు చేశారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. విద్య, వైద్యారోగ్యం తదితర శాఖలతో సమన్వయంతో మహిళ, శిశు సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1501 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను, 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, 610 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, మరో 397 కేంద్రాలు అద్దె భారం లేకుండా వివిధ భవనాల్లో కొనసాగుతున్నాయని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ వివరించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్‌లో ఫేస్ రికగ్నిషన్ అటెన్‌డెన్స్ అమలు చేయాలని అన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాకేశ్, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.