టీ–హబ్‌లో అందుబాటులో లేని కెమికల్స్ రోగ నిర్ధారణకు ఆటంకం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్న రోగులు
కడెం మండల కొత్త మద్దిపడగకు చెందిన రాజేశ్ ఐదు రోజులుగా జ్వరం, విరోచరాలతో బాధపడుతున్నాడు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఐదు రోజులు దాటితే రక్త పరీక్ష చేసి రోగ నిర్ధారణ చేయాలి. కానీ టీ–హబ్ అధికారులు రసాయనాలు లేని కారణంగా సీబీపీ పరీక్షలు రాయవద్దని సమాచారం ఇవ్వడంతో వైద్యులు రక్త నమూనా తీసుకోకుండా, రోగనిర్ధారణ చేయకుండా మందులు ఇచ్చి పంపించారు. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. సీబీపీ, డెంగీ, టైఫాయిడ్, మలేరియా ఇలా ఏ పరీక్షలు చేయడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ల్యాబ్‌లు ఆర్థికంగా దోచుకుంటున్నాయి.
నిర్మల్‌చైన్‌గేట్: ఆస్పత్రికి వచ్చిన రోగి రోగం నిర్ధారణ చేయాలంటే సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) టెస్టు అవసరం. రోగ నిర్ధారణ చేయకుండా చికిత్స ఓ ప్రయోగమే. నిర్ధారణ అయితే.. దానికి సంబంధించిన మందులే రాసి ఇవ్వొచ్చు. అయితే జిల్లాలో కొన్ని రోజులుగా రోగులు రక్త పరీక్షకు నోచుకోవడం లేదు. రోగ నిర్ధారణ జరగడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యులు మొక్కుబడిగా నాలుగైదు రకాల మందులు రాసి పంపుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలోని టీ–హబ్‌లో రోగ నిర్ధారణకు అవసరమైన కెమికల్స్ అందుబాటులో లేకపోవు. జిల్లాలోని 33 ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన శాంపిళ్లను ఈ టీ–హబ్‌కు పంపిస్తుంటారు. టీ–హబ్‌లో రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే కెమికల్స్ లేకపోవడంతో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్), డెంగ్యూ వంటి ముఖ్యమైన పరీక్షలు నిలిచిపోయాయి.
బ్లడ్ శాంపిళ్లు సేకరించొద్దని..
డయాగ్నస్టిక్ హబ్‌లలో పలు రకాల పరీక్షలు జరగకపోవడంతో, అందుబాటులో లేని పరీక్షల వివరాలను ప్రతిరోజూ వాట్సాప్‌లో ఆ కేంద్రం పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులకు పంపిస్తున్నారు. ఆ జాబితా ప్రకారమే రోగుల నుంచి నమూనాలు సేకరించి పంపాలని సూచిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోని డయాగ్నస్టిక్ హబ్ నుంచి అందుబాటులో ఉన్న పరీక్షల జాబితా వచ్చాకే రోగుల నుంచి నమూనాలు తీసుకోవాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు.
గ్రామీణులకు తప్పని తిప్పలు
జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ కేంద్రాలపైనే ఆధారపడి ఉంటున్నారు. చిన్న జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా సమీప కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. అక్కడి సిబ్బంది ఇచ్చే మందులను తీసుకెళ్తుంటారు. పల్లె ప్రజలకు పరీక్షలు చేసి మందులు ఇచ్చేలా వైద్య శాఖ అధికారులు ప్రతి కేంద్రంలోనూ సీబీసీ యంత్రాలను అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో ప్రజలు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు జ్వరాల బారిన పడినవారు జిల్లా కేంద్రానికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం కావడంతో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
ఇష్టారీతిన విధులు..
టీ–హబ్‌లో ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, నలు గురు ల్యాబ్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్టుతోపాటు పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, బయోకెమిస్ట్రీకి చెందిన వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, మరో అసోసియేట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీ–హబ్‌లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ మీ ప్రమాణం యాప్ ఉన్నా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నట్టు ఆరోపణలు ఉ న్నాయి. పాథాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్ పోస్టులు ఖా ళీగా ఉన్నాయి. మిగతా వైద్యులు టీ–హబ్‌కు రావ డం లేదని, వీరికి ఆన్‌లైన్‌లో రిపోర్టులు పంపితే తప్ప చూడరని సమాచారం. వైద్యులు విధులకు హాజరై పర్యవేక్షిస్తే పరీక్షల నిర్వహణ కొంత మెరుగయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రసాయనాల సరఫరా లేక..
134 పరీక్షలకు 60 మాత్రమే..
ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని డయాగ్నస్టిక్ హబ్‌లో ప్రతీ గంటకు 1,520 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మెషీన్ ద్వారా 1,200 టెస్టులు, ఇమ్యూనో అనలైజర్ మెషీన్ ద్వారా 220, సీబీపీ మెషీన్ ద్వారా 100 టెస్టులు ఒకేసారి నిర్వహిస్తారు. ప్రభుత్వం హబ్ ద్వారా ప్రజలకు 134 రకాల టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. కొంతకాలంపాటు సక్రమంగానే నిర్వహించేవారు. ఇటీవల అందుబాటులో ఉండే టెస్టుల సంఖ్య చాలా తగ్గిపోయింది. హబ్‌లో ఎప్పుడు ఏ టెస్టు ఉంటుందో తెలియక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం 60 రకాల పరీక్షలే నిర్వహిస్తుండడంతో చేసేది లేక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. 134 రకాల టెస్టులు ఉచితంగా అందాల్సి ఉండగా, హబ్‌ను నిర్లక్ష్యం చేస్తుండడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు సంబంధించి 33 సెంటర్ల ద్వారా శాంపిళ్లు వస్తుంటాయి. ఐదు వాహనాల ద్వారా నిర్దేశించిన రూట్లలో శాంపిళ్లు సేకరించి తెస్తుంటారు. ఇక్కడ హబ్‌లో టెస్టులు నిర్వహించి బాధితుల ఫోన్లకు 24 గంటల్లో రిపోర్టులు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఆ మెసేజ్‌ను సంబంధిత వైద్యాధికారికి చూపించిన తర్వాత మందులు రాస్తారు. అవసరమైతే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఇటీవల రసాయనాల (రియాజెంట్స్) సరఫరా లేక కొన్ని టెస్టులు నిలిచిపోతున్నాయి. చాలాకాలంగా రసాయనాల సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ పరీక్షలు నిర్వహించడానికి పలు రకాల రసాయనాలు అవసరం. వాటిని హైదరాబాద్ నుంచి సరఫరా చేస్తుంటారు. అయితే ఆయా రసాయనాలు లేనప్పుడు సంబంధిత టెస్టులు నిలిచిపోతున్నాయి. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా ప్రభుత్వం రసాయనాలు సరఫరా చేస్తోంది. ఇటీవల సరఫరా నిలిచిపోయింది.


