ఆరుతడి.. కాస్త మెరుగుపడి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి.. కాస్త మెరుగుపడి

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

● తగ్గుతున్న వరి సాగు విస్తీర్ణం ● పెరిగిన ఆరుతడి పంటల సాగు

చిత్రంలోని రైతుపేరు మూగ సత్యం. లక్ష్మణచాంద మండలం పీచర గ్రామానికి చెందిన ఈయన ఏటా వరి సాగుచేసేవాడు. ఎల్‌నినో కారణంగా ఈసారి వర్షాలు తక్కువగా పడతాయని వ్యవసాయాధికారులు తెలుపడంతో ఆరుతడి పంటలు సాగుచేశాడు. తక్కువ నీటితో బెండ, దోస, బీర, ఆకు కూరలు పండిస్తున్నాడు. ఎకరం విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నాడు.

చిత్రంలోని రైతుపేరు చిన్నయ్య. లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌కు చెందిన చిన్నయ్య తనకున్న ఎకరంలో ఆరుతడి పంటలైన బెండ, బీర, చిక్కుడు, కూర బొబ్బరి, సొరకాయ వంటి కూరగాయలు సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో కూరగాయలు సాగుచేస్తూ లాభాలు పొందుతున్నట్లు తెలిపాడు.

లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు తగ్గించాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించింది. ఈమేరకు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌, మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలు, వ్యవసాయాధికారులు రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతు వేదికల్లో, గ్రామాలలో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ సంప్రదాయ వరి సాగుచేసే రైతులు ఆరుతడి పంటలకు మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో పంటల సాగు ఇలా..

వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్‌ జిల్లాలో ఈ వానాకాలంలో ప్రధానంగా పత్తి 1,60,000 ఎకరాలలో, సోయా 1,06,000 ఎకరాల్లో, వరి 90 వేల ఎకరాలలో, మొక్కజొన్న 45 వేల ఎకరాల్లో, పసుపు 5,550 ఎకరాల్లో, కంది 12 వేల ఎకరాల్లో ఇతర పంటలు 2 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈమేరకు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.

పంట మార్పిడికి మొగ్గు..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో జిల్లాలో కొంత మేరకు పంట మార్పిడికి రైతులు మళ్లుతున్నారు. గతేడాది వరి 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి 1.40 ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు 90 వేల నుంచి లక్ష ఎకరాలలో సాగు అవుతోందని వ్యవసాయాధికారులు తెలిపారు. అలాగే కంది గత ఏడాది కేవలం 6 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఆఏడాది 12 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది ఆయిల్‌పామ్‌ 400 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 4 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలైన కంది, ఆయిల్‌పామ్‌ వైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. మిగతా రైతులు కూడా వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

మంచి లాభం వస్తుంది

వరికి బదులు తక్కువ నీటితో సాగయ్యే బీర, బెండ వంటి కూరగాయాలు అర ఎకరంలో సాగు చేస్తున్నాను. సాగు, తన ఖర్చులు పోనూ నిత్యం రూ.1500 నుంచిరూ.2 వేల వరకు లాభం వస్తుంది. కూరగాయల సాగు మంచి లాభదాయకమైన పంట.

– రమణారెడ్డి, రైతు, పొట్టపెల్లి(కె)

ఆరుతడి పంటలే మేలు

ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత తక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలి. కంది, పెసర, మినుము, బొబ్బర్లు, నూనె గింజలు అయిన వేరుశనగ, సన్‌ప్లవర్‌ వంటివి సాగు చేయడం మేలు.

– అంజిప్రసాద్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement