భైంసాటౌన్: రెక్కాడితే గానీ డొక్కాడని బీడీ కార్మికుల జీవితాల్లో ఆశల దీపాలు వెలగడం లేదు. దశాబ్దాలుగా పొగచూరుతున్న కార్మికుల బతుకుల్లో వెలుగులు నిండడం లేదు. ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకంలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి మాత్రమే నూతన ఫించన్లకు దరఖాస్తులు స్వీకరించనుండగా, బీడీ కార్మికులకు మొండిచేయి చూపింది. చేయూతలో బీడీ కార్మికులను విస్మరించడంతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో లక్షన్నరకు పైగా..
జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు దాదాపు లక్షన్నరకుపైగా ఉన్నారు. వీరిలో బీడీలు చుట్టే మహిళలతోపాటు పరిశ్రమలో పనిచేసే ప్యాకర్లు, చాట్‌వాలాలు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 61,933 మంది బీడీ కార్మికులకు పింఛన్లు అందుతున్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. కొంతమందికి మాత్రమే పరిమితమైంది. ఒకే ఇంట్లో ఇద్దరు బీడీ కార్మికులు ఉంటే ఒక్కరికే పింఛన్ ఇవ్వడం, కటాఫ్ తేదీల పేరుతో వేలాది మంది పథకానికి దూరమయ్యారు. ఆ తరువాత ప్రతీసారి ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తామని, రూ.4,016కు పెంచుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
కార్మిక సంఘాల ఆందోళన..
ప్రభుత్వం నూతనంగా అందించనున్న చేయూత పింఛన్లకు బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడంతో కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునిచ్చారు. రాత్రింబవళ్లు పొగాకు వాసన పీలుస్తూ క్షయ, ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న కార్మికులకు సరైన వైద్య సదుపాయాలు కరువయ్యాయి. బీడీ కార్మికుల ఆస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంటోంది. ఒకవైపు ప్రభుత్వాల ఆంక్షలు, మరోవైపు కంపెనీల దోపిడీతో బీడీ పరిశ్రమ రోజురోజుకూ కుదేలవుతోంది. కొన్ని యాజమాన్యాలు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పని దినాలు అమలు చేస్తున్నాయి. దీంతో కార్మికుల ఉపాధి దెబ్బతింటోంది. చాలీచాలని కూలీతో కుటుంబాన్ని పోషించుకోవడం గగనంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయూత పింఛన్ అందిస్తే ప్రయోజనంగా ఉంటుందన్న డిమాండ్ వినిపిస్తోంది.


