పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులు, నేరాల నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలపై సమీక్షించారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి..

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్‌డీపీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. కేసుల పురోగతిపై ఎస్‌హెచ్‌వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి, పాత కేసుల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. మాన్యువల్‌ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్‌ నమోదుల మధ్య వ్యత్యాసాలు సరిచేయాలని ఆదేశించారు.

రౌడీషీటర్లపై నిఘా..

రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు.

చోరీల నియంత్రణకు చర్యలు..

ఇళ్ల దొంగతనాలు, వాహన చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. క్లూస్‌ టీమ్‌, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. రాత్రి గస్తీని పెంచడంతోపాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచి ప్రజల సహకారంతో చోరీలు అరికట్టాలని తెలిపారు.

సైబర్‌ మోసాలపై అలర్ట్‌..

ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే గోల్డెన్‌అవర్‌లోపు 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. లేదా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

నిత్యం డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లు..

ప్రతిరోజూ సాయంత్రం డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఫేక్‌ నంబర్‌ ప్లేట్లు, నంబర్‌ ప్లేట్ల మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల కండీషన్‌, నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వాహనాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement