పల్లెకు చేరువగా ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

పల్లెకు చేరువగా ప్రజావాణి

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

● ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహణ ● ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

నిర్మల్‌చైన్‌గేట్‌: అనేక వ్యయప్రయాసలకు గురవుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణులు అర్జీలు చేతపట్టుకుని ప్రతీ సోమవారం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కలెక్టర్‌కు చెప్పుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రజావాణికి వచ్చిన రోజు పని బంద్‌ పెట్టుకోవాల్సిందే. ఒకవైపు దూరభారం, ఇంకోవైపు ఖర్చులు, మరోవైపు ఇతర పని చేసుకునే వీలు ఉండదు. ఈ క్రమంలో ప్రజావాణిని మండల స్థాయిలో నిర్వహించాలని విన్నపాలు వచ్చాయి. దీంతో గ్రామీణుల ముంగిటకు అధికార యంత్రాంగాన్ని చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రతీ సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. వికేంద్రీకరణతో జిల్లాలోని 18 మండలాలు, 400 గ్రామాల ప్రజలకు వెసులుబాటు కలుగుతుంది. ఎంపీడీవో నోడల్‌ అధికారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని వెంటనే అమలుచేసే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు ఈనెల 10వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కావాలి. కానీ, బోనాల పండుగ సెలవు ఉండడంతో 17వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి మొదలవుతుందని తెలు స్తోంది. గ్రామీణ ప్రజలు మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి ఉపయోగించుకుంటారా అనే సందిగ్ధం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంతోపాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజా వాణి నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాభవన్‌ తర్వాత జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రజావాణి ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా మే 4 రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల్లో ప్రజావాణి ప్రారంభించారు.

తగ్గనున్న దూర, ఆర్థిక భారం..

జిల్లాలోని 400 గ్రామాల ప్రజలు సమస్యలు కలెక్టర్‌కు విన్నవించుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసంతో ప్రతీ సోమవారం కలెక్టరేట్‌ కు వస్తున్నారు. దీనివల్ల దూర భారమే కాకుండా ఆ ర్థికంగా ఇబ్బందులు కూడా పేద, మధ్యతరగతి ప్ర జలు ఎదుర్కొంటున్నారు. పలు మండలాలు కలెక్టరేట్‌కు 60 కిలోమీటర్ల పైనే దూరం ఉన్నప్పటికీ ప్ర జలు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి తోడు ఒక్కో దరఖాస్తుదారుడు తన సమస్యను విన్నవించుకోవడానికి రూ.200లకు పై గా ఖర్చు చేస్తున్నారు. ఒకసారితో సమస్య తీరడం లేదని, నెలల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతు న్న వారూ ఉన్నారు. అంతేకాకుండా నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ చేరుకోవాలంటే ఆటో చార్జి రూ.150 వసూలు చేస్తున్నారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి గ్రామాల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.

నిధుల లేమితో పరిషత్‌లు..

ఒకప్పుడు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నటువంటి మండల, జిల్లా పరిషత్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. 2019 నుంచి నిర్వహణ నిధులు విడుదల కావడం లేదు. కొందరు ఎంపీడీవోలు తమ సొంత నిధులతో కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రజావాణి బాధ్యతలను మండల పరిషత్‌లకే అప్పగించింది. ఈ కార్యక్రమానికి మండల ప్రజావాణికి దాదాపు 23 శాఖల నుంచి అధికారులు హాజరవుతారు. తహసీల్దార్‌, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గహ నిర్మాణం, మిషన్‌ భగీరథ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఇలా అధికారులు అందరూ ప్రజావాణికి వస్తారు. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేస్తేనే కార్యక్రమం విజయవంతం కానుంది.

ఆర్డీవో స్థాయిలో

ప్రజావాణి ఆర్డీవో స్థాయిలో ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తున్నా దరఖాస్తులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆర్డీవోలకు ఒకటి రెండు దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఐదు, ఆరు దరఖాస్తులు దాటడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టర్‌కు 120 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. ఈక్రమంలో మండల పరిషత్‌ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement