లక్ష్మణచాంద: మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెరువుల్లోకి ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈసారి జూలై నెల చివరి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు నిండకపోవడంతో టెండర్ల ప్రక్రియ కొంత ఆలస్యం అయినట్టుగా అధికా రులు అంటున్నారు. ఇక ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లోకి, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు.
ఈ నెల 17 వరకు గడువు
ఈ నెల 6న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు గడువు ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ సమక్షంలో టెండర్లు తెరవనున్నారు. టెండర్లలో రెండు షెడ్యూళ్లకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి తక్కువ ధర కోట్ చేసిన వారికే చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. టెండర్ వచ్చిన గుత్తేదారుల చేప పిల్లల పెంపకం కేంద్రాలను తనిఖీ చేసి అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ చివరి వరకు చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
జిల్లాలో ఇలా...
జిల్లాలో మొత్తం 19 మండలాలు, 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 557 చెరువులు, 4 ప్రా జెక్టుల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్యశాఖ అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 427. 35 లక్షల చేప పిల్లలు వదిలేందుకు అధికారులు కా ర్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. 35 ఎం.ఎం. నుంచి 40 ఎం.ఎం. పరిమాణం గల చేప పిల్లలను 480 చెరువుల్లో 215.76 లక్షలు, 80 ఎం.ఎం నుంచి 100 ఎం.ఎం. పరిమాణం గల చేప పిల్లలను 77 చెరువుల్లో 82.21 లక్షలు, అలాగే 80 ఎం.ఎం. నుంచి 100 ఎం. ఎం. పరిమాణం గల చేప పిల్లలను 4 ప్రాజెక్టుల్లో 129.38 లక్షల చేప పిల్లలను వదలనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలోని మత్స్యకారులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు స్వీకరిస్తాం. గడువులోగా టెండరు దారులు ముందుకు వస్తే సకాలంలో చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందించి జీవనోపాధి కల్పించేందుకు తగిన చర్యలు చేపడుతాం. – అవినాష్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లా సమాచారం..
మొత్తం మత్స్యకార సంఘాలు 225
సంఘాల్లో సభ్యులు 13,348
జిల్లాలో ఎంపికై న చెరువులు 557
పంపిణీ చేసే చేప పిల్లలు 297.97 లక్షలు
ఎంపికై న ప్రాజెక్టులు 04
పంపిణీ చేసే చేప పిల్లలు 129.38 లక్షలు
మొత్తం చేప పిల్లలు 427.35 లక్షలు


