చోరీలకు ‘చెక్‌’ పడేనా? | - | Sakshi
Sakshi News home page

చోరీలకు ‘చెక్‌’ పడేనా?

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

● జిల్లా కేంద్రంలో 7 ప్రత్యేక చెక్‌పోస్టులు ● రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం..

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. నిత్యం ఏదో ఒకచోట చోరీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చోరీలు, ఇతర నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు నేరస్థుల కదలికలను నియంత్రించేందుకు ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు పట్టణంలోని కీలక ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటలు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ.. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

వాహనాలపై ప్రత్యేక నిఘా.

జిల్లాలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు దొంగతనాలకు పాల్పడే ముఠాల కదలికలను ముందుగానే గుర్తించి అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. అవసరమైతే వాహనాల్లోని సామగ్రిని కూడా తనిఖీ చేయనున్నారు.

ఏడు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు..

గజులపేట్‌ ఔట్‌ స్కర్ట్‌, సెయింట్‌ థామస్‌ స్కూల్‌ ప్రాంతం, సిద్ధాపూర్‌, సోఫీనగర్‌ దర్గా, మహాలక్ష్మి ఆలయం ప్రాంతం, వైఎస్సార్‌ కాలనీ రోడ్‌, మంజులాపూర్‌ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గాలన్నింటిపై ప్రత్యేక నిఘా ఉండటంతో దొంగలకు అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు.

కూడళ్లలో మూడో కన్ను..

ఇక కూడళ్లలో సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించనున్నారు. పెట్రోలింగ్‌ బృందాలు, చెక్‌పోస్టుల సిబ్బంది పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ అనుమానాస్పద కదలికలపై వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమ కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, వాహనాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను సమర్థంగా అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement