లక్ష్మణచాంద/ఖానాపూర్: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్, ఖానాపూర్ మండలాల్లోని పుష్కర ఘాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. పుష్కరాల నాటికి ఘాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. గత పుష్కరాల్లో నమోదైన భక్తుల రద్దీ వివరాలను తెలుసుకుని, ఈసారి అంచనా మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. చేపట్టే అన్ని పనులు నాణ్యతతో, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లకు చేరుకునే మార్గాల్లో స్పష్టమైన సూచికల బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు, తగిన పార్కింగ్ సౌకర్యాలు, రాకపోకలకు అనువైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి..
ఖానాపూర్: పట్టణంలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. డిజిటలైజేషన్ గడువులోగా ఆన్‌లైన్ పూర్తి చేయాలని సూచించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, స్వీకరించిన ఫారాలు, డిజిటలైజేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌వో యాప్‌ను పరిశీలించిన ఆయన ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ అనిల్, తహసీల్దార్లు సంతోష్, సుజాత, ఎంపీడీవో రాధారాథోడ్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోయబ్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సర్.. 75 శాతం పూర్తి
నిర్మల్: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ 75 శాతం డిజిటైజేషన్ పూర్తయ్యిందని, గ్రామసభల్లో ఖరారు చేసిన అన్ కలెక్టెడ్ ఫారాలను కలిపితే 81 శాతం పూర్తయినట్లు కలెక్టర్ భవేశ్‌మిశ్రా పేర్కొన్నారు. సర్ ప్రక్రియ పూర్తిలో రాష్ట్రంలో టాప్‌టెన్‌లో ఉన్నామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, నిర్మల్, భైంసా వంటి పట్టణ ప్రాంత ఓటర్లే ఎన్యూమరేషన్ ఫారాలను అందించడంలో వెనుకంజలో ఉన్నారన్నారు. వచ్చేనెల 3 వరకు సర్ ప్రక్రియ గడువు పెంచినప్పటికీ.. ఈనెల 20లోపు సదరు ఫారాలను అందించి, డిజిటైజేషన్ చేయించుకోవాలని సూచించా రు. ఫారాలను తీసుకోనివారు, తిరిగి ఇవ్వని వారు, గుర్తించనివారు, చనిపోయినవారికి సంబంధించి గ్రామ/వార్డు సభల్లో అందరి సమక్షంలో కారణాలు రాసి ఫైనల్ రిపోర్టు పంపిస్తున్నామని వివరించారు. అర్హులైన ఓట ర్లు ఆలస్యం చేయకుండా సర్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయించుకోవాలని సూచించారు.


