బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..! | - | Sakshi
Sakshi News home page

బల్దియా ఉద్యోగం.. ఇష్టారాజ్యం..!

Jul 18 2026 12:06 AM | Updated on Jul 18 2026 12:06 AM

● విధులకు రాకున్నా ఠంచనుగా వేతనాలు ● చర్చనీయాంశమైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నియామకం

ఒకరికి బదులు మరొకరు విధులు

భైంసాటౌన్‌: భైంసా బల్దియాలో ఉద్యోగం ఇష్టారాజ్యం అన్నట్టుగా నడుస్తోంది. కొందరు ఉద్యోగులు విధులకు రాకున్నా ప్రతినెలా ఠంచనుగా వేతనం పొందుతున్నారు. ఆరోగ్య, ఇతర కారణాలను సాకుగా చూపుతూ తమకు బదులు బంధువులు, ప్రైవేట్‌ వ్యక్తులతో పనిచేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే మొత్తంగానే విధులకు దూరంగా ఉంటూ సంబంధిత విభాగం అధికారులను మేనేజ్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. విధులకు రాకున్నా.. ఒక్క సెలవు కూడా వినియోగించలేదని హాజరు రిజిస్టర్‌లో చూపుతూ పూర్తి వేతనం పొందుతున్నారు.

కిందిస్థాయి ఉద్యోగులే ఎక్కువ...

మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పలువురు రెగ్యులర్‌ ఉద్యోగులు ఎక్కువగా విధులకు రాకుండా వేతనం పొందుతున్నట్లు తెలుస్తోంది. వేతనాలు ఎక్కువగా ఉండడం, పారిశుద్ధ్య పనులు చేయాల్సి వస్తుండడంతో నామోషీగా భావించి తమకు బదులు ప్రైవేట్‌ వ్యక్తులతో పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో కొన్నిరోజులు విధులకు పంపించి, తరువాత అది కూడా చేయడం లేదని వినికిడి. ఫలితంగా పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పుతోంది. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతోనే పనులు చేయిస్తున్నారు. ఫలితంగా వారు శ్రమదోపిడీకి గురవుతున్నారు. అంతేగాక, అటెండర్‌ విధులు నిర్వహించే ఇద్దరు ఉద్యోగులు సైతం విధులకు రాకుండా వేతనం పొందుతున్నట్లు తెలిసింది. ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ కొందరు విధులకు రావడం లేదని, ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

చర్చనీయంగా ఉద్యోగి నియామకం...

బల్దియాలోని పర్యావరణ విభాగంలో ఓ ఉద్యోగిని ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించడం విమర్శలకు తావిస్తోంది. ఎలాంటి ప్రకటన లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా నియమించడం, కొందరు ముఖ్యుల పాత్ర ఉండడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయమై సోషల్‌ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. బల్దియాలో జరుగుతున్న ఈ తంతుపై కమిషనర్‌ లింగయ్యను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నియామకంపై స్పందిస్తూ గత కమిషనర్‌ హయాంలో నియమించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement