ఆర్జీయూకేటీలో అవగాహన సదస్సు
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) కరీంనగర్ విస్తరణ కేంద్రం సంయుక్తంగా ‘క్రాఫ్టింగ్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్’ అనే అంశంతో అవగాహన సదసుస మంగళవారం నిర్వహించాయి. భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎఈ మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్ కమిషనర్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్వయం ఉపాధి, ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలపై దృష్టి సారించింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ, స్టార్టప్‌లకు అందే నిధులు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు, సాంకేతిక సహాయం, మార్కెట్ అవకాశాల గురించి వివరించారు. పోటీతత్వ ప్రపంచంలో విజయం కోసం రిస్క్ తీసుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని తెలిపారు.
వైస్ ఛాన్స్‌లర్ ప్రోత్సాహం
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులను ఉద్యోగ శోధకుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మర్చడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు అనుగుణంగా వ్యవస్థాపకతను అవలంబించాలని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఓఎస్డీ ప్రొఫెస్ మురళీదర్శన్ మాట్లాడుతూ విద్యా–పరిశ్రమల మధ్య అంతరాన్ని తణ్ణుపెట్టడంలో ఇటువంటి సహకారాలు కీలకమని ఉద్ఘాటించారు. సంస్థ స్థాపన, మూలధన సేకరణ, పారిశ్రామిక అనుభవాలపై దృష్టి సారించాలన్నారు. అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) డాక్టర్ కె.మహేశ్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎస్.విఠల్ (అసోసియేట్ డీన్, సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్), శేఖర్ శీలం (అసోసియేట్ డీన్, అకడమిక్స్), చరణ్ రెడ్డి (మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్), రాహుల్ అన్పత్ (అసిస్టెంట్ ప్రొఫెసర్)తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


