
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి వరద గండం పొంచివుంది. ఉగ్రరూపం దాల్చిన యమునా నది ఏ క్షణాన అయినా ఢిల్లీని ముంచెత్తే అవకాశం ఉందనే హెచ్చరికలు అందుతున్నాయి. యమునా నది (నేడు)సోమవారం ప్రమాద స్థాయిని దాటిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీకి చెందిన 18 గేట్లను తొలిసారిగా తెరిచి, భారీ పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాత యమునలో నీటి ఉధృతి అధికం అయ్యింది.
హత్నికుండ్ బ్యారేజీల నుండి ప్రతి గంటకు నీటిని విడుదల చేసిన కారణంగా రాజధానిలోని యమునలో నీటి మట్టం పెరిగిందని అధికారులు నిర్ధారించారు. యమునా నది సోమవారంనాటికే ప్రమాద స్థాయిని దాటింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హర్యానా, వజీరాబాద్‌లోని హత్నికుండ్ బ్యారేజీ నుండి విడుదల చేసిన నీటి కారణంగా ఆగస్టు 19 నాటికి నీటి మట్టాలు 206 మీటర్లకు చేరుకుంటాయనే అంచనాలున్నాయి. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికులను తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
యమునా నది స్థాయి 206 మీటర్లు దాటే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఆగస్టు 19 నాటికి యమున 206 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎగువ యమున ప్రాంతంలో భారీ వర్షపాతం దృష్ట్యా, ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం ఆగస్టు 19, తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో 206.00 మీటర్లు దాటవచ్చని తెలిపింది. ఈ వర్షాకాలంలో అత్యధికంగా నీటిని విడుదల చేసిన హత్నికుండ్ బ్యారేజీ ప్రస్తుతం 1.27 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోందని, ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని కేంద్ర వరద నియంత్రణ విభాగపు అధికారులు తెలిపారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.