ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది.. | Angkor Wat The Largest Temple In Cambodia And 8th Wonder of The World, Know About Its History, Architecture And Bon Om Touk Festival | Sakshi
Sakshi News home page

Angkor Wat Temple Story: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..

Nov 2 2025 9:34 AM | Updated on Nov 2 2025 12:55 PM

Angkor Wat the largest temple In Cambodia And 8th Wonder of The World

కంబోడియాలోని సీమ్‌ రీప్‌ నగరంలో ఉన్న ‘ఆంగ్‌కోర్‌ వాట్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. అలాగే ఇది ఆగ్నేయాసియా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఉనికిలో ఉన్న ఖ్మేర్‌ సామ్రాజ్యపు అద్భుత సృష్టి. ఇది క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో రెండవ సూర్యవర్మ ఆధ్వర్యంలో నిర్మించిన వైష్ణవాలయం. విష్ణువు వెలసిన ఈ ఆలయం తర్వాత బౌద్ధ ఆరామంగా మారింది. 

దీని నిర్మాణ శైలి హిందూ పురాణాలలోని దేవతల నివాసమైన మేరు పర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం తదితర పురాణ గాథల    దృశ్యాలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. వందలాది మంది అప్సరసల నృత్య భంగిమలు, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. 

ఈ ఆలయానికి గల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా, దీన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. 

నదికి నీరాజనం
‘బోన్‌ ఓమ్‌ టౌక్‌’ అనే వేడుక– కంబోడియాలో అత్యంత ఆకర్షణీయమైన ఉత్సవం. ఇది వర్షాకాలం ముగింపును, టోన్లే సాప్‌ నది ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ సంబరాలు మూడురోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాదిలో నవంబర్‌ 4 నుంచి మొదలై నవంబర్‌ 6 వరకు కొనసాగుతాయి.

‘వర్షాకాలంలో మీకాంగ్‌ నది ఉప్పొంగడంతో– టోన్లే సాప్‌ నది దాని సహజ దిశలో ప్రవహించకుండా, వెనక్కి ప్రవహిస్తుంది. ఈ పండుగ సమయంలో, వర్షాకాలం ముగిసిపోవడంతో, ఆ వెనక్కి ప్రవహించే ప్రవాహం ఆగిపోయి, టోన్లే సాప్‌ నది తిరిగి తన సహజ దిశలో మీకాంగ్‌ వైపు ప్రవహించడం మొదలవుతుంది. టోన్లే సాప్‌ నది తిరిగి సహజదిశలో ప్రవహించడాన్ని స్థానికులు ఈ వేడుకతో పండుగ చేసుకుంటారు.

ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా రాజభవనం ముందు టోన్లే సాప్‌ నదిపై సంప్రదాయబద్ధంగా పొడవైన పడవల రేసులు (డ్రాగన్‌ బోట్‌ రేసులు) నిలుస్తాయి. ఆ దేశ నలుమూలల నుంచి వందలాది పడవలు పోటీపడతాయి. మూడు రోజులు అందంగా అలంకరించిన, దీపాలతో వెలిగించిన పడవల ఊరేగింపు జరుగుతుంది. ఈ పోటీలే కాకుండా పలు క్రీడా పోటీలు జరుగుతాయి. ఈ సంబరాలు చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తారు. 

చివరగా పౌర్ణమి రాత్రి చంద్రుడికి ప్రత్యేక వందనాలు తెలుపుతారు. అలాగే అక్‌ అంబోక్‌ అనే బియ్యం లేదా అటుకులతో చేసే తీపి వంటకాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఉత్సవం కంబోడియన్ల ఐక్యతకు నిదర్శనం. హిందూ, బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సంప్రదాయంలో, చంద్రుడిని గౌరవించడం ఒక ఆచారం. 

(చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement