మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా

Womens Reservation Bill 2023: Rajya Sabha clears historic womens reservation bill - Sakshi

రాజ్యసభలో ఏకగ్రీవం

అనంతరం నిరవధిక వాయిదా పడ్డ ఉభయ సభలు

న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్‌ అధినియమ్‌ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.

సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్‌ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్‌ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది  

పార్టీలకతీతంగా మద్దతు
అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌) డిమాండ్‌ చేశారు.

ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్‌ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జేడీయూ) ప్రశ్నించారు.

2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్‌ఎస్‌), వైగో (ఎండీఎంకే) డిమాండ్‌ చేశారు. తక్షణం డీ లిమిటేషన్‌ కమిషన్‌ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్‌) సభ్యుడు దేవెగౌడ గుర్తు        చేసుకున్నారు.

 ఇప్పుడేం జరుగుతుంది?
రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు.

ఏమిటీ బిల్లు?
► ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లును నారీ శక్తి విధాన్‌ అధినియమ్‌గా పేర్కొంటున్నారు.
► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తారు.
► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు.  

 చరిత్రాత్మక క్షణాలివి!
ప్రధాని మోదీ భావోద్వేగం
మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు.

మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది.

వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు.

రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు.  

పార్లమెంటు నిరవధిక వాయిదా
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్‌. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top