దీపాల కాంతుల్లో పూల పరిమళాల మధ్య అందంగా వివాహ వేడుక సిద్ధమైన వేళ.. నవవధువు శవంగా మారిపోయింది. ఆమె కలలు పంట ఆవిరైపోయింది. తనను తాను పెళ్లికూతురిగా చూసుకుంటూ ముస్తాబవుతున్న తరుణంలో.. యమపాశం తరముకొచ్చింది. పెళ్లి చేసుకోబోయే ప్రియుడే కాలయముడిగా మారిపోయాడు. ఆమె అందమైన ఊహాలోకం కాస్తా నిమిషాల వ్యవధిలో యమలోకానికి పయనమైంది.
ప్రాణంగా చూసుకుంటానని సహజీవనంలో మాటిచ్చిన ప్రియుడు.. పెళ్లి పీటల వరకూ వచ్చేసరికి తనలోని సైకోను బయటకు తీశాడు. శారీ కోసం మొదలైన గొడవ ‘స్త్రీధనం( మన భాషలో కట్నం అంటామనుకోండి) వరకూ వెళ్లింది. ఆమె నుంచి డబ్సు ఆశించిన ఆ కసాయి.. ఏడు అడుగులు నడవకుండానే తనలోని కర్కశత్వాన్ని చూపెట్టాడు. ఆ నుదిట తిలకం దిద్దాల్చిన వాడే.. ఆమె రక్తం కళ్ల చూశాడు. ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు, పెళ్లి ముహూర్తానికి గంట దూరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సజ్జన్ బారైయా, సోని హిమ్మత్‌లు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరగా లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. వారి బంధాన్ని ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినా తాము పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ బంధాన్ని కొనసాగించారు. ఇక పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. ఆ సమయం కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురుచూశారు. పెళ్లి శుభలేఖలు కొట్టించారు కూడా. వారి పెళ్లి ముహూర్తం శనివారం రాత్రి(అంటే నిన్న రాత్రి). ఆ రాత్రే ఆ యువతికి కాలరాత్రి అయ్యింది.
శారీ కోసం గొడవమొదలైంది వీరివురి మధ్య. అది నగదు వ్యవహారం వరకూ వెళ్లింది. అంతే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ మృగాడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనే సంగతిని మరిచిపోయాడు. ఐరన్ పైప్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆపై ఆమె తలను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె ప్రాణం వదిలేసింది. తాను కట్టుకోబోయేవాడు ప్రాణం కూడా తీస్తాడనే ఏనాడు ఆమె కల కూడా కని ఉండదు. కానీ ఆ రాక్షసుడు ఆవేశానికి ఆమె బలైపోయింది. వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి జరగాల్సిన చోట చావు కేకలు వినిపించాయి.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు ఏడాదిన్నర కాలంగా లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడానికి ఇలా సిద్ధమైన క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా ఆ అమ్మాయి ప్రాణాన్ని ప్రియుడే తీశాడని డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఆర్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.


