Sakshi News home page

నెక్స్ట్‌ సూపర్‌ పవర్‌గా భారత్‌? చైనా పని అయిపోయినట్లే?

Published Tue, Aug 15 2023 11:06 AM

Will India Surpass China to Become the Next Superpower - Sakshi

ఇటీవలి కాలంలో భారతదేశానికి చైనా ప్రధాన భద్రతా ముప్పుగా పరిణమించింది. చైనా.. పాకిస్తాన్‌తో జతకట్టి, భారత్‌కు ఆందోళనకరంగా మారింది. చైనా తన సరిహద్దుల్లో భారత్‌తో తలపడుతున్న ఘర్షణల ఫలితంగా ఈ  రెండు దేశాలు  ప్రత్యర్థులుగా మారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్- భారత్‌ మధ్య వ్యూహాత్మక ప్రయోజనాల కలయిక భారత్‌కు మరింత శక్తిని అందించనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను నియంత అని అభివర్ణించారు.

సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో యూఎస్‌ భాగస్వామ్యం
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అటు బైడెన్‌ లేదా ఇటు మోదీ తమ భాగస్వామ్యం ప్రధానంగా చైనా సవాళ్లను ఎదుర్కోవడం గురించేనని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ  ఈ భాగస్వామ్యం ఇందుకేనని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌.. అగ్రరాజ్యం అమెరికా తమ సంబంధాలను బలపరు కోవడం చూస్తుంటే ఇది భారత్‌కు చైనాను ఎదుర్కొనేందుకు కలసివచ్చే అంశంలా కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఆమధ్య భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్  మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటన చైనా గురించి కాదని, అయితే సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో చైనా పాత్రకు గురించిన ప్రస్తావన ఎజెండాలో ఉన్నదన్నారు. భారత్‌- అమెరికా మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలలో భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్-జెట్ ఇంజిన్‌ల తయారీ, జనరల్ అటామిక్స్ సాయుధ డ్రోన్‌ల కొనుగోలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి సాయంతో భారత్‌ చైనా సైన్యం ఎత్తుగడలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనుంది.
ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం!

రాబోయే 30 ఏళ్లలో..
భారత్‌- అమెరికాల బిలియన్-డాలర్ల జీఈ డీల్‌లో అత్యాధునిక జెట్ ఇంజన్ టెక్నాలజీ ఒకటి. ఈ భాగస్వామ్యం  రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్‌ సీనియర్ నిపుణుడు సమీర్ లాల్వానీ మాట్లాడుతూ ‘ఇది ప్రతిష్టాత్మక సున్నితమైన సాంకేతికత  అని, దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇది భవిష్యత్తులో అనేక తరాల జెట్ ఇంజిన్ల తయారీకి దారి తీస్తుందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం, ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకం కానున్నదని పేర్కొన్నారు.

టెక్‌ స్టార్టప్‌లు పుష్‌ చేసే దిశగా భారత్‌
కొన్ని దశాబ్దాలుగా సైనిక ఆధునికీకరణలో నిమగ్నమై ఉన్న చైనాతో పోటీ పడాలంటే, భారత్‌లోని టెక్ స్టార్టప్‌లను ఎలా పుష్ చేయాలో, తద్వారా సైనిక స్థాయిలో ఎలా సాంకేతికతలను రూపొందించాలనే దానిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్‌ ఒక కథనంలో పేర్కొంది. సాంకేతికత, రక్షణ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించడమనేది ప్రధాని మోదీ పర్యటనలో చోటుచేసుకున్న ప్రధాన అంశమని ఆ కథనంలో పేర్కొన్నారు.

వివరాలు వెల్లడించిన వాషింగ్టన్‌ పోస్ట్‌ 
కరోనావైరస్ మహమ్మారి సమయంలో సుమారు మూడు సంవత్సరాలు ప్రపంచం నుండి తనను తాను వేరుచేసుకున్న చైనా  తిరిగి ఇప్పుడు తన పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2014 నుండి 2018 వరకు మోదీకి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ సైనిక పరికరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాల ప్రయత్నంలో భాగంగానే భారత్‌.. అమెరికాతో జీఈ ఒప్పందం చేసుకున్నదన్నారు. ప్రస్తుతం బ్రౌన్ యూనివర్శిటీలో సీనియర్ ఫెలోగా ఉన్న సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అమెరికాతో కుదిరిన చిప్ ప్లాంట్, డిఫెన్స్ ఒప్పందాలు రక్షణ రంగంలో తయారీలను పునరుద్ధరించే లక్ష్యాన్ని పూర్తి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే రాయితీలను కల్పించే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహమ్మారి సమయంలో పెట్టుబడిదారులకు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. 

హిమాలయ సరిహద్దుల్లో ఘర్షణలు
అమెరికా పరిపాలన అధికారులు భారతదేశం తమకు ప్రధాన ఆర్థిక, సైనిక భాగస్వామిగా చేరడంపై సంతృప్తిగా ఉన్నారు. ఇది చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్‌లో పోషించగల వ్యూహాత్మక పాత్రను స్పష్టం చేస్తున్నదంటున్నారు. కాగా గత దశాబ్దం కాలంగా భారతదేశానికి చైనా ముప్పుగా పరిణమించింది. 2020 నుండి ఇరు దేశాలు తమ హిమాలయ సరిహద్దుల గురించి ఘర్షణపడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 1962 యుద్ధం తర్వాత చైనాపై భారతదేశవాసుల అభిప్రాయంలో మార్పు వచ్చింది.  చైనాను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 100కి పైగా చైనీస్ యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ను కూడా నిషేధించింది.

చైనాను అధిగమించి..
మీడియాతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత్‌- అమెరికాల భాగస్వామ్యం రక్షణ రంగంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందన్నారు. భారతదేశం తన స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూనే, అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసుకుంటున్నదన్నారు. పరిస్థితులన్నింటినీ గమనిస్తే భారత్‌ రాబోయే కాలంలో చైనాను అధిగమించి సూపర్‌ పవర్‌ కానున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం!

Advertisement

తప్పక చదవండి

Advertisement