
ప్రియునితో కలిసి కాపురం
ఏడాదిన్నర తరువాత అరెస్టు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు.
దంపతులు వేర్వేరుగా మిస్సింగ్..
జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప, లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది.
ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్‌ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు.