రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్‌.. కట్‌ చేస్తే కటకటాల్లోకి! | Who is Mooli Devi Worked As Cop With Fake Identitiy For 2 Years | Sakshi
Sakshi News home page

రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్‌.. కట్‌ చేస్తే కటకటాల్లోకి!

Jul 5 2025 8:15 PM | Updated on Jul 5 2025 8:21 PM

Who is Mooli Devi Worked As Cop With Fake Identitiy For 2 Years

రెండేళ్లు పోలీస్‌ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్‌ యంగ్‌ ఆఫీసర్‌ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్‌లో రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో వాటిని షేర్‌ చేసుకుని సంబురపడిపోయేది. కట్‌ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. 

జైపూర్‌లోని రాజస్థాన్‌ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్‌ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్‌ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. 

మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్‌ కోటా క్యాండిడేట్‌గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్‌ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ట్రైనింగ్ గ్రూప్‌లలో యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్‌లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేది. అయితే.. 

ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్‌లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. 

మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్‌ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement