టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సంచలన ఆరోపణ
న్యాయపరంగా ముందుకెళ్తా: గవర్నర్ ఆనంద బోస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆనంద బోస్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని, బీజేపీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తు న్నారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
ఎన్నికల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) చేపట్టడం ఎంతో అవసరమని గవర్నర్ ఆనందబోస్ శనివారం పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం తిరిగి నెలకొంటుందన్నారు. ఆ వెంటనే ఎంపీ బెనర్జీ గవర్నర్‌పై దాడికి దిగారు.
బీజేపీ నేరగాళ్లకు రాజ్‌భవన్‌లో ఆశ్రయం కల్పిస్తున్న గవర్నర్, వారికి బాంబులు, తుపాకులు సమకూర్చుతున్నారని ఆరోపణలు చేశారు. ఆయన ఆ పనిని వెంటనే ఆపేయాలని కోరారు. ఎంపీ బెనర్జీ ఆరోపణలపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను గవర్నర్ ఆనందబోస్ పరిశీలిస్తు న్నారని రాజ్‌భవన్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ‘రాజ్‌భవన్ ఉదయం 5 గంటల నుంచి తెరిచే ఉంటాయి.
బెనర్జీ వచ్చి తన ఆరోపణల మేరకు ఆధారాలుంటే పరిశీలించుకోవచ్చు. పౌరసంఘాల ప్రతినిధులు, జర్నలి స్టులు కూడా రావచ్చు. ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే న్యాయపరంగా ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎంపీ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌కు కూడా లేఖ రాస్తాం’అని ఆ అధికారి చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని 151, 152, 353 సెక్షన్ల ప్రకారం ఎంపీ చర్యలు శిక్షార్హమైనవని ఆయన చెప్పారు. దీనిపై మళ్లీ ఎంపీ బెనర్జీ స్పందించారు. గవర్నర్ న్యాయపరంగా చర్యలు తీసుకుంటే తానేమీ చూస్తూ కూర్చోనన్నారు.


