జేడీవాన్స్‌కు ఇచ్చిపడేసిన భారత్‌ | US Green Card programme suspension H1-B unwarranted, India slams | Sakshi
Sakshi News home page

జేడీవాన్స్‌కు ఇచ్చిపడేసిన భారత్‌

Oct 9 2026 2:23 PM | Updated on Oct 9 2026 2:37 PM

US Green Card programme suspension H1-B unwarranted, India slams

సాక్షి, ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారతీయులపై చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. అవి అనవసరమైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ మండిపడింది. వలసదారుల సేవలను విస్మరించడం అన్యాయమని గ్రీన్ కార్డ్ కఠిన చర్యల నేపథ్యంలో, విదేశీ కార్మికులను "ఒప్పంద సేవకులు"గా అభివర్ణిస్తూ  వాన్స్ చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవిగా ఖండించింది.

భారత్ తన ప్రకటనలో " ప్రతిభావంతుల బదిలీ ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందని, ఎందుకంటే ఇది భారతీయులకు అవకాశాలను కల్పించడమే కాకుండా, అమెరికా కంపెనీలకు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పనలతో పాటు అమెరికాలోని వాటాదారుల సంపదను కూడా సృష్టిస్తుందని అందువల్ల ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూర్చే అంశం, ఈ ప్రక్రియలోని భాగస్వాములందరూ ఈ వాస్తవాన్ని గ్రహించగలరని మా అంచనా. అమెరికా ప్రకటించిన చర్యలు రెండు దేశాల ఉమ్మడి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లవు," అని మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

యజమాని-ప్రాయోజిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఒక కీలకమైన దశ అయిన శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమంలో పాల్గొనకుండా, మైక్రోసాఫ్ట్ , టాటా, విప్రో, ఇన్ఫోసిస్, అడోబ్, కాగ్నిజెంట్, HCL,  క్యాప్‌జెమిని అనే ఎనిమిది ఐటీ సంస్థలను యునైటెడ్ స్టేట్స్ నిషేధించిన తర్వాత ఈ ఖండన వచ్చింది. ఈ విధానం అమెరికన్ కార్మికులను ఉద్యోగ మార్కెట్ నుండి దూరం చేస్తోందని ఆరోపించింది.

జేడీవాన్స్ ఏమన్నారు?

హెచ్‌-1బీ వీసా విధానాన్ని తప్పుడు దోవలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారంటూ ‌  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్‌ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీయులతో పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. పైగా విదేశీ ఉద్యోగులను ‘వెట్టి చాకిరీ చేసే బానిసలు’గా ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. గత ఏడాది 6,000 మంది అమెరికన్‌ ఉద్యోగులను తొలగించగా.. అదే సమయంలో 6,300 హెచ్‌-1బీ వీసాలు పొందిందని వాన్స్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటూ, విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో మైక్రోసాఫ్ట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఒక్కో ఉద్యోగికి బదులుగా..
మైక్రోసాఫ్ట్‌ అమెరికన్‌ ఉద్యోగులను తొలగిస్తూ.. విదేశీ ఉద్యోగుల నియామకాలను కొనసాగించడంపై వాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది సంస్థ 6,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని, అదే సమయంలో 6,300 హెచ్‌-1బీ వీసాలు పొందిందని, దాదాపు 3,000 గ్రీన్‌కార్డుల ప్రక్రియలకు సంబంధించిన ప్రయోజనాలు పొందిందని చెప్పారు.

“మైక్రోసాఫ్ట్‌ గొప్ప అమెరికన్‌ సంస్థే. కానీ అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అమెరికన్‌ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకోలేరు” అని వాన్స్‌ వ్యాఖ్యానించారు. లెక్కలు చూస్తే.. తొలగించిన ప్రతి అమెరికన్‌ ఉద్యోగికి బదులుగా 1.5 మంది విదేశీ ఉద్యోగులను తీసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి విధానాన్ని అమెరికా ఇంతకాలం అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు. తాజాగా దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఇదీ చదవండి:హెచ్‌-1బీ వీసాలపై వాన్స్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement